మహబూబాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు(MLC Thakkallapally) అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోతులు, కుక్కల సమస్య తీవ్రమైందన్నారు. కోతులు (Monkeys) కూరగాయలు, పండ్ల తోటలు, పొలాలను నష్టపరుస్తు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలు చిన్న పిల్లలు, వృద్ధుల పైన దాడులు చేస్తున్నాయని, ఇప్పటికే రాష్ట్రంలో 342 కేసులు నమోదయ్యాయన్నారు. కోతుల బెడతను ప్రభుత్వం ఆశామాషీగా తీసుకుంటే జనజీవనం, వ్యవసాయ రంగం అధోగతి పాలవడం ఖాయమన్నారు.
ప్రభుత్వం రాజకీయం చేయకుండా కోతులు, కుక్కల సమస్యకు తక్షణ పరిష్కార మార్గాలను చూపాలన్నారు. దీనికితోడు గ్రామాలు, పట్టణాల్లో దోమలు విజృంభిస్తుండడంతో వ్యాధులు ప్రబలుతున్నాయని, అనేక మంది డెంగ్యూ, మలేరిమా, చికెన్ గున్యా వంటి విష జ్వరాల బారిన పడుతున్నారని, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ రోగులతో కిక్కిరిసి పోతున్నాయన్నారు. నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టి గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించిన తరువాతే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించి ప్రజలను ఓట్లు అడగాలని రవీందర్రావు అన్నారు.