మహబూబాబాద్ రూరల్, జనవరి 22 : ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మరోసారి మోసం చేస్తున్నదని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. బుధవారం మహబూబాబాద్‌లోని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రోజులుగా నిర్వహిస్తున్న గ్రామసభలతో ప్రజలకు ఒరిగేదేమీలేదన్నారు. అధికారులు ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్‌కార్డులు తదితర పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారిపేర్లు మాత్రమే చదువుతున్నారని పేర్కొన్నారు.
నిజమైన లబ్ధిదారులను సంక్షేమ పథకాలకు ఎంపిక చేయలేదని ఆరోపించారు. తులం బంగారం, వృద్ధులకు ఆరు వేల పెన్షన్, విద్యార్థినులకు స్కూటీల పంపిణీ, స్కాలర్షిప్ వంటివి ఇంకాఅమలు చేయలేదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి బోగస్ మాటలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ప్రతి పేదకు లబ్ధి జరిగేలా పాలన అందించారని గుర్తుచేశారు. ప్రతి నిరుపేదకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.