హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డివి మురికి మాటలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు విమర్శించారు. హెల్త్ చెకప్ కోసం గురువారం హైదరాబాద్ యశోద దవాఖానకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని రేవంత్ ఆకాంక్షించినట్టు, వైద్యులకు పలు సూచనలు చేసినట్టు వచ్చిన వార్తలపై స్పందించిన శంభీపూర్ రాజు పై విధంగా స్పందించారు. ‘మైకు దొరికితే కేసీఆర్‌పై ఏడ్చే రేవంత్‌రెడ్డా.. కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకబు చేసేది?’ అని ప్రశ్నించారు. కేసీఆర్‌పై నిత్యం నిందలేస్తూ, చిన్నాపెద్దా తేడా లేకుండా, గౌరవ మర్యాదలను పక్కనపెట్టే సీఎం.. వేదిక ఏదైనా కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకుంటారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణ సాధకుడి చావు కోరే మానవత్వం లేని మనిషి రేవంత్ అని దుయ్యబట్టారు. తెలంగాణ జాతిపిత, తెలంగాణ అభివృద్ధి స్వప్నికుడిని ద్వేషించడమే పనిగా పెట్టుకునే రేవంతా ఆయన మేలుకోరేది అని గురువారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డిని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని పేర్కొన్నారు. కేసీఆర్ మనసు చూరగొనడం ట్వీట్ చేసినంత సులభం కాదని రేవంత్‌ను ఎద్దేవా చేశారు.
మరోవైపు, సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ తదితరులు కేసీఆర్ ఆరోగ్యాన్ని కూడా రాజకీయం చేస్తుండటంపై తెలంగాణ సమాజం నివ్వెరపోయింది. చిన్నపాటి అనారోగ్యంతో దవాఖానకు వచ్చిన కేసీఆర్‌కు ఏదో అయిపోతున్నట్టు వారు మాట్లాడుతుండటంపై విస్మయం వ్యక్తమవుతున్నది. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని రేవంత్‌రెడ్డి, అదే సమయంలో ఆయన ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ బండి సంజయ్ ట్వీట్లు చేసినట్టు వార్తలు వైరల్ కావడం రాజకీయంలో భాగమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చివరికి కేసీఆర్ ఆరోగ్యాన్ని కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం వీరికే చెల్లిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.