హైదరాబాద్ : ఆడబిడ్డపై రాజకీయాలు చేస్తే నాలుక కోస్తామని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హెచ్చరించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాజీవితంలో ఉన్న నాయకుల ప్రవర్తన, వ్యవహారం ఆదర్శనీయంగా ఉండాలని, అయితే ఎంపీ అర్వింద్ అత్యంత నీచంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పసుపు బోర్డు పేరుతో ఓట్లు వేయించుకొని హామీలను గాలికి వదిలిన అర్వింద్ తెలంగాణ ఆడబిడ్డ కవితపై రాజకీయాలు చేయటం సిగ్గుచేటన్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడి రాజకీయాలను అర్వింద్ దిగజారస్తున్నారని ధ్వజమెత్తారు.
మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్న అర్వింద్ తన పద్ధతి మార్చుకోకపోతే నాలుకకోస్తామని హెచ్చరించారు. బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ నేతలతో టచ్ ఉన్నారని చెప్పే అర్వింద్‌ను రాజకీయ బ్రోకర్ అనాలా ? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను గురించి చిల్లర మాటలు మాట్లాడిన అర్వింద్‌కు ప్రజలు తగిన బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. బలుపు మాటలు మాట్లాడి తల్లిదండ్రుల విలువలను దిగజార్చేలా అర్వింద్ మాట్లాడంపై తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందని, తన ఇంటిపై దాడి జరిగిన విషయం తన తల్లికి తెలియకున్నా.. తల్లిని రాజకీయాల్లోకి లాగిన దౌర్భాగ్యుడు అర్వింద్ అంటూ ధ్వజమెత్తారు.