హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): మానుకోటతో పెట్టుకుంటే ఎవరికైనా మూడినట్టేనని, ఇది చరిత్ర చెప్తున్న సత్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. ‘మానుకోటతో ఎవరు పెట్టుకున్నా వారికి మూడుతుంది.. గతంలో కాంగ్రెస్‌కు మూడింది.. ఇప్పుడు మానుకోట నుంచే రేవంత్‌రెడ్డి పతనం ప్రా రంభమైంది’ అని నిప్పులు చెరిగారు. మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదు ట 25న ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని తెలిపారు. తన సొంత నియోజకవర్గంలోని లగచర్ల గిరిజన రైతులను మెప్పించలేని రేవంత్ తెలంగాణ ప్రజలను ఎలా మెప్పిస్తారని ప్రశ్నించారు.
తెలంగాణభవన్‌లో శుక్రవారం ఎమ్మెల్సీలు తకళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవితతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకు లు చెప్తేనే మహబూబాబాద్‌లో మహాధర్నా కు పోలీసులు అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. మహాధర్నాకు అనుమతి ఇచ్చిన న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంట్లో ప్రసంగిస్తే.. రేవంత్‌రెడ్డి అదే రా జ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ సర్కారు దమనకాండతో కనీ సం ఊరుదాటని గిరిజన మహిళలు, ఢిల్లీ వరకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని వాపోయారు. ఇకనైనా లగచర్లలో ఫార్మా విలేజ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ కంపెనీలు, కుటుంబసభ్యుల కంపెనీల కోసం గిరిజనుల పచ్చని పంట పొలాలను రేవంత్‌రెడ్డి లాక్కుంటున్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. గతంతో తాము కూడా కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీల కోసం భూములు సేకరించామని, కానీ ఇలా దౌర్జన్యం చేయలేదని, భూ నిర్వాసితులను ఒప్పించి మెప్పించి నష్టపరిహారం చెల్లించి నిబంధనల ప్రకారం సేకరించామని గుర్తుచేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరించిందని, ఆ భూముల్లో ఫోర్త్‌సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేయాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నారని మండిపడ్డారు. మానుకోటలో మహాధర్నాకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు. రేవంత్‌రెడ్డి ఎకడ మీటింగ్ పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయుకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని, అరెస్టులకు భయపడబోమని, ప్రజలకు అండగా ఉంటామని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేద గిరిజనులపై చేస్తు న్న దాడులుకు నిరసనగా మహబూబ్‌బాద్ లో 25న మహాధర్నా నిర్వహిస్తామని ఎమ్మె ల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. 20న పోలీసులు ధర్నాకు అనుమతి ఇస్తామని చెప్తే నే ఏర్పాట్లు చేసుకున్నామని, రాత్రి 11 గంట ల తర్వాత అనుమతి ఇవ్వలేమని, సీఎం ఆఫీస్ నుంచి అనుమతి లేదని చెప్పడం దారుణమని మండిపడ్డారు. ‘మహబూబ్‌బాద్‌లో ఏం జరిగిందని పోలీసులతో కవాతు నిర్వహించారు? 144 సెక్షన్ ఎందుకు పెట్టారు? ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేశారు?’ అని నిలదీశారు.
మానుకోటకు వస్తే కేటీఆర్‌ను అడ్డుకుంటామని, రాళ్లదాడి చేస్తామని మీడియా ముఖంగా కాంగ్రెస్ జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని వారిపై కేసు నమోదుచేయాలని మాజీ ఎంపీ మాలోత్ కవిత డిమాండ్ చేశారు. లగచర్లలో గిరిజనులకు అండగా తాము ఉన్నామని భరోసా ఇవ్వడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ధర్నాకు ఆహ్వానించామని తెలిపారు. అన్ని గిరిజన సంఘాల నాయకుల విజ్జప్తి మేరకు కేటీఆర్ మహాధర్నాకు వస్తున్నారని చెప్పారు.