మహబూబాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): కేసులు పెట్టాల్సింది అమాయక గిరిజన రైతులపై కాదని, ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేది లేదని చెప్పినా వినకుండా అధికారులను ఉసిగొల్పుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద నమోదు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్ల రైతుల తిరుగుబాటుకు సీఎం రేవంత్‌రెడ్డే నైతిక బాధ్యత వహించాలని సూచించారు. అరెస్ట్ చేసిన గిరిజన రైతులను బేషరతుగా విడుదల చేసి సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పిచ్చోడి చేతిలో రాయిలాగా సీఎం పాలన ఉన్నదని విమర్శించారు. రేవంత్ చెప్పిన పనులు చేయనందుకు ఐఏఎస్, ఐపీఎస్‌లను 11 సార్లు బదిలీలు చేశారని ఆరోపించారు.
పంతాలకు పోవద్దు రైతుల మాట విను: డీకే అరుణ
వికారాబాద్, నవంబర్12: తమ ప్రాంతంలో ఫార్మా కంపెనీ వద్దని రైతులు చెప్తున్న మాటను సీఎం రేవంత్‌రెడ్డి వినాలని, పంతాలకు పోవద్దని బీజేపీ ఎంపీ డీకే అరుణ సూచించారు. లగచర్ల ఘటన నేపథ్యంలో మంగళవారం వికారాబాద్‌లో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘కలెక్టర్‌పై దాడి విచారకరమని పేర్కొన్నారు. ఫార్మా కంపెనీ పేరుతో అమాయక రైతులను అరెస్టు చేయవద్దని సూచించారు.