హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి జిల్లాకో కమిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయా కమిటీల్లో బీఆర్ఎస్ నేతలకు చోటు కల్పించాలని కోరారు. దళిత, గిరిజన, బీసీ విద్యార్థుల పట్ల మాజీ సీఎం కేసీఆర్‌కు ఎంతో అభిమానం ఉన్నదని, ఆ వర్గాల విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రిగా విశేష కృషి చేశారని కొనియాడారు. ప్రస్తుతం ఏడాది నుంచి కాంగ్రెస్ పాలకుల పర్యవేక్షణాలోపంతో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పలు సమస్యలు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఏడాది కాలంలో 54 మంది విద్యార్థులు మరణించారని తెలిపారు. గురువారం శాసనమండలిలో గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన అన్న అంశంపై రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన వసతుల కల్పన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పాలకుల నిర్లక్ష్యాన్ని సత్యవతి రాథోడ్ ఎత్తిచూపారు. ఆమెతోపాటు బీఆర్ఎస్ సభ్యులు పలు అంశాలను లేవనెత్తారు.
గురుకులాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చుతుందని సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ సభ్యులు ధ్వజమెత్తారు. 2014 కంటే ముందు ఎన్ని గురుకులాలు ఉన్నాయి.. 2023 నాటికి ఎన్ని గురుకులాలు ఏర్పాటయ్యాయో ఈ ప్రభుత్వం గ్రహించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు 54 మరణాలు జరిగాయని, ఆ మరణాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వ గురుకులాల్లో పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని విమర్శించారు. విద్యాశాఖ, గురుకులాల్లో ఎన్నో సమస్యలు పేరుకుపోతుంటే వాటి పరిష్కారంపై దృష్టి పెట్టకపోగా, మంత్రిని కూడా నియమించకపోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం బడ్జెట్లో 15 శాతం వరకు నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి శాసనమండలిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ గురుకులాల్లో పిల్లల ప్రాణాలు పోతున్నాయని, ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఒకే గురుకులంలోని విద్యార్థులను పాములు ఎందుకు కాటేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీశారు. గురుకులాల్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందని ప్రశ్నించారు.
గురుకుల విద్యార్థుల కోసం ఒక సహాయ కేంద్రం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి గురుకులంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటి గురించి పైఅధికారులకు తెలిపేందుకు, పరిష్కరించడం సులువు అవుతుందని సూచించారు. కేసీఆర్ హయాంలోనే విద్యారంగం బలోపేతమైందని గుర్తు చేశారు. అన్నివర్గాల శ్రేయస్సు కోరి పెద్ద మొత్తంలో కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేశారని తెలిపారు.
విద్యా విలువలకు, సంప్రదాయాలకు జపాన్ మూలమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న శాసనమండలి చర్చ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలో గురుకులాలకు పంపే ఆహార సరుకుల్లో జోరుగా కల్తీ జరుగుతుందని, ముఖ్యంగా ప్యాకెట్ల కారం, పసుపు వంటి వాటిలో కల్తీ జరుగుతుందని విమర్శించారు.
మహిళా గురుకులాల్లో పురుష ఉద్యోగులు, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, దానివల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి శాసనమండలి లఘు చర్చలో లేవనెత్తారు. పురుష సిబ్బందిని నియమించవద్దని సూచించారు. ఎన్ఆర్జీఈ నిధులను 50 శాతం విద్యాభివృద్ధి కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గురుకులాల అభివృద్ధి కోసం ప్రత్యేక పర్యవేక్షణాధికారులను నియమించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ శాసనమండలి చర్చ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని గురుకులాలను బలోపేతం చేయాలని కోరారు. అందుకోసం రాష్ట్ర బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని సూచించారు. కేసీఆర్ హయాంలోనే విద్యాభివృద్ధి విశేషంగా జరిగిందని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నిరసనల మధ్యనే తెలంగాణ పేమెంట్స్ అండ్ సాలరీస్ పెన్షన్ సవరణ బిల్లు-2024కు శాసనమండలి ఆమోదం తెలిపింది. మండలిలో గురువారం పెన్షన్ సవరణ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో మండలి బీఆర్ఎస్పక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతూ సలహాదారుల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని గతంలో విమర్శించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆయన ఎందుకు సలహాదారులను పెట్టుకున్నారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ, సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసిన తర్వాత బిల్లు ఉద్దేశాలపై శ్రీధర్‌బాబు సభకు వివరించారు. అనంతరం బిల్లు మండలి ఆమోదం పొందింది.