హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)పై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉన్నదని స్పష్టంచేశారు. వెంటనే నమోదు గడువును పొడిగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్, కేటీఆర్ ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. సోమవారం తెలంగాణ భవన్లో పార్టీ నాయకులు కర్నె ప్రభాకర్, వై సతీశ్‌రెడ్డి, సుమిత్రాఆనంద్, అభిలాశ్ రంగినేనితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘సర్’ కమిటీలోని పార్టీకి చెందిన తొమ్మిదిమంది సభ్యులు అన్ని జిల్లాల్లో ప్రక్రియను పరిశీలించినట్టు తెలిపారు. ‘సర్’ దరఖాస్తు ఫారాల పంపిణీలో సర్కార్ విఫలమైందని ఆరోపించారు. ఇప్పటివరకు 37 శాతం ఫారాలు మాత్రమే నింపారని వెల్లడించారు. బీఎల్వోలకు సరైన శిక్షణ ఇవ్వకుండానే క్షేత్రస్థాయికి పంపించారని విమర్శించారు.
‘సర్’ ప్రక్రియ లో ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తరఫున ఇప్పటికే అనేకసార్లు వినతిపత్రాలు అందజేశామని గుర్తుచేశారు. తమ సూచనలను పరిగణనలోకి తీసుకోకపోవడం శోచయనీయమని పేర్కొన్నారు. ‘సర్’పై ఎన్నికల సంఘం సన్నద్ధంగా లేదనే విషయం స్పష్టంగా అర్థమైందని చెప్పారు. ఫారాల పంపిణీ, ఓటర్ల వివరాల నమోదులో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిసిస్తున్నదని విమర్శించారు. ‘నాగర్సాహెబ్కుంటలో ఎండీ ఇస్లాం.. ఓటు గల్లంతవుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏటూరునాగారంలో ‘సర్’ ఫారాలు హైస్కూల్లో సమర్పించాలని ఎండీవో చెప్పారు. ఈ ఉదంతాలే ఎన్నికల సంఘం నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి’ అని దుయ్యబట్టారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు నమోదుచేయాలని, జిల్లాస్థాయిలో నిత్యం సమీక్షించాలని డిమాండ్ చేశారు.
‘సర్’ను పకడ్బందీగా నిర్వహించడంలో కాంగ్రెస్ సర్కార్ దారుణంగా విఫలమైందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. ప్రక్రియలోని లోపాలతో 50 నుంచి 60 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ అయ్యే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. అర్హుల్లో ఏ ఒక్కరి ఓటు పోయినా రేవంత్ సర్కార్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చక్కదిద్దాల్సిన ఎన్నికల సంఘం చోద్యం చూస్తున్నదని దుయ్యబట్టారు. బీఎల్వోలు ఇండ్లకు వెళ్లకుండా టెంట్లు వేసుకొని కూర్చుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో కేవలం 13 శాతమే పూర్తికావడం ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు.