కోరుట్ల, ఆగస్టు 13: రాష్ట్రంలో 23 నియోజకవర్గాల్లో అధికంగా ఉన్న పద్మశాలి కులస్థులకే ఆయాచోట్ల టికెట్లు కేటాయించాలని పద్మశాలీలు తీర్మానించారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని కావేరీ గార్డెన్ సమీప మైదాన ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన పద్మశాలి ఆత్మగౌరవ రాజకీయ యుద్ధ భేరి సభకు రాష్ట్రవ్యాప్తంగా 50 వేల పైచిలుకు మంది హాజరయ్యారు. ఈ సభలో ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ.. చట్టసభల్లో ప్రాతినిధ్యంతోనే హక్కుల సాధనకు అవకాశం దక్కుతుందని, పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు. పద్మశాలీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరారు. పద్మశాలీలు సంఘటితమై ఐకమత్యంతో మెదిలి తమ గౌరవాన్ని, ప్రతిష్ఠను పెంచుకోవాలని సూచించారు. పార్టీలకతీతంగా చట్టసభలకు పద్మశాలి బిడ్డలను పంపించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించుకోవాలని చెప్పారు. రాష్ట్రంలోని చేనేత సహకార సంఘం భవనాలు, పద్మశాలి సంఘ భవనాల ఖాళీ స్థలాల రక్షణకు కృషి చేస్తానని, చేనేత కార్మికుల హక్కుల కోసం పోరాడుతానని రమణ చెప్పారు. కోరుట్ల సభకు ఇంత పెద్ద సంఖ్యలో పద్మశాలీలు తరలిరావడాన్ని అభినందించారు.
పద్మశాలీలకు తెలంగాణ తలమానికం
పద్మశాలీలకు తెలంగాణ రాష్ట్రం తలమానికమని కర్నూలు ఎంపీ సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలోని పద్మశాలి కులస్థుల ఆదరాభిమానాలు పొందే భాగ్యాన్ని కలిగించిన పద్మశాలి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంత భారీ సంఖ్యలో బీసీలు ఒక్కచోట చేరడం దక్షిణ భారతదేశంలో ఇదే ప్రథమమని ఆత్మగౌరవ సభ నిర్వాహకుడు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి చెప్పారు. పలువురు పద్మశాలి సంఘం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులతోపాటు వరంగల్ మేయర్ గుండు సంధ్యారాణి, రాజ్యసభ మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవట్రి అనిల్ సభనుద్దేశించి మాట్లాడారు.
పలు అంశాలపై తీర్మానం
ఈ సందర్భంగా పద్మశాలి రాజకీయ యుద్ధ భేరి కోరుట్ల డిక్లరేషన్‌ను జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ ప్రవేశపెట్టారు. పద్మశాలీల కన్నా ఎకువ సంఖ్యలో ఇతర బీసీ కులాల వారు ఉన్న చోట తోటి బీసీలకు అవకాశం ఇచ్చే పార్టీలకే మద్దతు ఇవ్వాలని, పద్మశాలీల నాయకత్వానికి అవకాశాలు కల్పించిన స్థానాల్లో రాజకీయాలకతీతంగా మన వారినే గెలిపించుకోవాలని పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. పద్మశాలి కులస్థుల సంఖ్య బలం ఎక్కువగా ఉన్న 23 నియోజకవర్గాల్లో పార్టీలు టికెట్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని 33 జిల్లాలతోపాటు పాటు ఏడు రాష్ర్టాల నుంచి పద్మశాలి కులస్థులు, రాజకీయ, వ్యాపారరంగ ప్రముఖులు, విద్యావేత్తలు, ఉద్యోగులు, యువకులు సభలో పాల్గొన్నారు.