హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): రైతుల ఆదాయంపై పన్ను వేయాలనే నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నదని తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, 60 సంవత్సరాలు దాటిన రైతులకు పెన్షన్ ఇస్తామని గత ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
బుధవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, యెగ్గె మల్లేశంతో కలిసి మీడియా సమావేశంలో పల్లా మాట్లాడారు. మోదీ ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేబ్ రాయ్ ఓ పత్రికలో రాసిన వ్యాసంలో రైతు ఆదాయంపై పన్ను వేయాలని సూచించారని మండిపడ్డారు. ‘రైతుల ఆదాయంపై పన్ను వేసే నిర్ణయం రాష్ట్రాల పరిధిలోనిదని వివేక్ దేబ్రాయ్ అంటున్నారు. ఆయన ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ అనే విషయం గుర్తించుకొని మాట్లాడాలి. రాష్ట్రాలకు ఉచిత సలహా ఎలా ఇస్తారు? ప్రధాని తక్షణమే వివేక్‌ను పదవి నుంచి తప్పించాలి’ అని పల్లా డిమాండ్ చేశారు. మోదీ స్పందించకపోతే రైతుల ఆదాయంపై పన్ను అంశం ప్రధాని ప్రతిపాదనగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
బ్రిటిషర్ల చట్టాలు రద్దు చేస్తూ.. వారి పన్నులా?
బ్రిటిష్ హయాంలో చేసిన చట్టాలను ఒకొకటిగా రద్దు చేస్తున్న మోదీ సర్కారు రైతుల ఆదాయంపై పన్ను విషయంలో మాత్రం బ్రిటిషర్లను అనుసరిస్తుందా? అని ప్రశ్నించారు. అదానీకి భూములను అప్పగించడానికి కేంద్రం రైతుల ఆదాయంపై పన్ను వేయాలని చూస్తున్నదని ఆరోపించారు.
అధికారికంగానే గణతంత్ర దినోత్సవం
గవర్నర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అవమానించలేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగే గణతంత్ర వేడుకలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే, ప్రభుత్వ నిధులతోనే, ప్రభుత్వ సిబ్బందే నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఎంతగా ఇబ్బంది పెడుతున్నా తాము సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే బిల్లును పంపిస్తే ఇంతవరకు గవర్నర్ సంతకం చేయలేదని, దీంతో యూనివర్సిటీల్లో వెయ్యికిపైగా ఉద్యోగ నియామకాలు నిలిచిపోయాయని తెలిపారు. ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం మాట్లాడుతూ రైతుల ఆదాయంపై పన్ను వేయాలన్న కేంద్రం ఆలోచన వెనుక పెద్ద కుట్ర ఉన్నదని అనుమానం వ్యక్తంచేశారు. పన్ను వేయాలని ఆలోచిస్తే రైతులు తిరగబడతారని హెచ్చరించారు.