జైపూర్: ఓటింగ్ తర్వాత భర్త, బిడ్డతో సహా బీజేపీ అభ్యర్థిని అదృశ్యమైంది. వారి కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కిడ్నాప్ చేసి ఉంటారన్న ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. (BJP candidate, husband missing) సెప్టెంబర్ 9న రాజస్థాన్‌లోని బరన్‌లో మున్సిపల్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరిగింది. అయితే ఓటింగ్ తర్వాత 16వ వార్డు బీజేపీ అభ్యర్థిని అంతిమ యాదవ్, ఆమె భర్త సంజయ్ యాదవ్, వారి ఏడేళ్ల బిడ్డతో సహా అదృశ్యమయ్యారు. వారిని చివరిసారి పోలింగ్ కేంద్రం వద్ద చూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మొబైల్ ఫోన్లు స్విచ్చాఫ్‌లో ఉండటంతో ఆందోళన చెందారు. కిడ్నాప్‌కు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు వారిని తీసుకెళ్లినట్లు ఆరోపించారు.
కాగా, భర్త, బిడ్డతో సహా బీజేపీ అభ్యర్థిని అంతమ యాదవ్ అదృశ్యం కావడంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
అయితే ఎన్నికల అనంతరం రాజకీయ వ్యూహంలో భాగంగా అభ్యర్థులను ఒకచోటకు తరలించినట్లు అంతా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిని అంతిమ యాదవ్, తన భర్త, బిడ్డతో కలిసి అదృశ్యం కావడం రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు దారితీసింది. తమ పార్టీ అభ్యర్థిని మాయం కావడంపై బీజేపీ కూడా ఆందోళన చెందుతున్నది. ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నది.