YS Jagan : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సర్టిఫికెట్ల పరిశీలనలో ప్రభుత్వం చెబుతున్న ‘ఏడు దశల వెరిఫికేషన్’ ప్రక్రియపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇన్ని దశల తనిఖీలు జరుగుతున్నాయని చెబుతున్నప్పటికీ, అక్రమాలు వెలుగుచూడటాన్ని ఆయన ప్రశ్నించారు.
ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం తేలికగా వ్యవహరిస్తోందని సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఈ సందర్భంగా జగన్ కొన్ని నిర్దిష్ట ఘటనలను ఉటంకించారు. కొందరు విజేతల పేర్లు జాబితాలో గల్లంతవడం, కొన్ని సర్టిఫికెట్లు నకిలీవని స్వయంగా ఖోఖో క్రీడా సమాఖ్య అధికారులు చెప్పడం, ఒక అభ్యర్థి పేర్కొన్న క్రీడా ఈవెంట్‌ను తాము అసలు నిర్వహించలేదని నాగార్జున విశ్వవిద్యాలయం స్పష్టం చేయడం వంటి ఉదంతాలను ఆయన ప్రస్తావించారు.
ఇన్ని అక్రమాలు బయటపడుతుంటే, అసలు ఎక్కడ, ఏం వెరిఫికేషన్ చేశారు..? అని జగన్ నిలదీశారు. ఇన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నా డీఎస్సీ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని ప్రభుత్వం ఎలా చెప్పగలదని ఆయన ప్రశ్నించారు. ఈ లోపాలే అక్రమాలకు ఆస్కారం కల్పించాయా అని సందేహం వ్యక్తంచేశారు. జరిగిన తప్పులకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
డీఎస్సీ నియామక ప్రక్రియలో నెలకొన్న పరిస్థితులపై సమగ్రమైన వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. కాగా మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉంది. అయితే నిబంధనల ప్రకారమే నియామకాలు జరిగాయని, సర్టిఫికెట్ల పరిశీలన పలు దశల్లో పకడ్బందీగా నిర్వహించామని ప్రభుత్వం పలుమార్లు స్పష్టంచేసింది. కొన్ని ఆరోపణలపై అధికారులు మీడియా సమావేశాల్లో వివరణ కూడా ఇచ్చారు.
అయినప్పటికీ తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలతో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం చెబుతున్న పారదర్శకతకు, ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు మధ్య డీఎస్సీ ప్రక్రియ రాజకీయ వివాదంగా కొనసాగుతున్నది.