నల్లగొండ, సెప్టెంబర్ 12 : వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజలు పర్యావరణ పరిరక్షణకు పాటుపడేలా మట్టి గణపతులనే పూజించాలని వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ ఎలిశాల రవిప్రసాద్ తనయుడు ఎలిశాల హేమచంద్ర పిలుపునిచ్చారు. వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పౌరుడిగా పర్యావరణ ప్రేమికుడిగా తమ వంతు బాధ్యతగా గత 9 సంవత్సరాల నుండి నల్లగొండ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది వినాయక చవితి సందర్బంగా 12 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. నీటిలో కరగకపోవడం, కరిగినా జీవరాశులకు నష్టం వాటిల్లే పీఓపీ లతో తయారైన విగ్రహాలకు బదులు మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను పూజించాలని ఆయన సూచించారు.

వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 12 వేల మట్టి గణపతుల పంపిణీ
ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడకపోతే ఆ విపత్తుకు ప్రపంచం మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణను ప్రజలు సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. ప్రభుత్వం కూడా వివిధ వేదికల ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నదని పౌరులుగా మన కర్తవ్యాన్ని మన చుట్టూ ఉండే పరిసరాలను వ్యర్ధమయం చేసుకోకుండా చూడాలన్నారు. ఈ విషయంలో వైఆర్పీ ఫౌండేషన్ సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ ముందుకు వెళ్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో భరత్, అభినవ్ రెడ్డి, ఫౌండేషన్ ఆర్గనైజర్ యామ దయాకర్, 48వ డివిజన్ కార్పొరేటర్ యామ కవిత, బొమ్మపాల గిరిబాబు, వెంకట్, శివ, గణేష్, సురేష్, శివ సంతోష్, విజయ్, మిర్యాల శ్రీను, ప్రవీణ్, కర్నాటి లక్ష్మీ, జీనుగు జ్యోతి, రజిత, కుమారి, నవనీతా, విజయ పాల్గొన్నారు.

వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 12 వేల మట్టి గణపతుల పంపిణీ