హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సాగునీటి రంగానికి కేంద్రం నిధులు ఇచ్చినట్టు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణకు ఐదు ప్రాజెక్టులు ఇచ్చామని ప్రధానమంత్రి హోదాలో ఉన్న మోదీ అబద్ధాలు ఆడటం బాధకరమని పేర్కొన్నారు. అవి ఏ ప్రాజెక్టులో చెబితే ధన్యవాదాలు తెలియజేస్తామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేంద్రం వాటా సున్నా అని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ రాకతో రాష్ర్టానికి ఏదైనా ప్రయోజనం కలుగుతుందని ఆశించిన తెలంగాణ ప్రజలకు నిరాశే మిగిలిందని చెప్పారు. ధాన్యాన్ని కేంద్రం కొనకపోయినా రైతులు నష్టపోవద్దని కేసీఆర్ ప్రభుత్వం యాసంగి సీజన్లో ఇప్పటివరకు రూ.22 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు.
ఎఫ్సీఐ ఇప్పటివరకు కనీసం కిలో బియ్యాన్ని కూడా కొనలేదని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ సాధారణ నాయకుల్లాగే పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అనినీతి జరగలేదని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే తన సొంత నిధులతో నిర్మించిందని పేర్కొని, తీరా సభలో తాము నిధులు ఇచ్చామని పేర్కొనడం మోదీ స్థాయికి తగదని హితవు చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ఒక్క రూపాయి కూడా ఇవ్వని విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ సంస్కృతిని, ఖ్యాతిని గొప్పగా వల్లెవేసిన మోదీ ఆ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు ఏం చేశారని నిలదీశారు. తెలంగాణకు తాను, తన ప్రభుత్వం చేయని పనులను కూడా మోదీ చాలా అద్భుతంగా చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు అన్ని టీకాలను ప్రజలకు కేంద్రమే ఉచితంగా ఇచ్చిందన్న విషయాన్ని మరచిపోయి, కరోనా వ్యాక్సిన్ను ఉచితంగా ఇచ్చామని చెప్పుకోవడం మోదీకే చెల్లిందని విమర్శించారు.
కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు జవాబు ఏది?
దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై సీఎం కేసీఆర్ సంధించిన ఏ ఒక్క ప్రశ్నకూ ప్రధాని మోదీ సమాధా నం చెప్పకపోవడం హాస్యాస్పదంగా ఉన్నదని పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. కనీసం మంత్రులతో అయి నా సమాధానం చెప్పించకపోవడం అంటే తప్పించుకోవడమే కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంతో మోదీ ప్రభుత్వం దోషిగా నిర్ధారణ అయ్యిందన్నారు. మొత్తంగా మోదీ పసలేని, పేలవమైన ప్రసంగం చేశారని పేర్కొన్నారు.