హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): గడిచిన ఎనిమిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణ అద్భుతరీతిలో అభివృద్ధి చెందిందని.. యావత్ దేశం కూడా అదేవిధంగా అభివృద్ధి చెందాలని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ఆకాంక్షించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల సందర్భంగా స్వాగతోపన్యాసం చేసిన పల్లా రాజేశ్వర్రెడ్డి.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించారు. ఎనిమిదిన్నర సంవత్సరాలుగా అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ అనేక అద్భుతాలను సృష్టించిందన్నారు. దేశంలోని మరే రాష్ట్రం సాధించని విధంగా అపూర్వ ప్రగతిని సాధించామని తెలిపారు. దేశాభివృద్ధి కోసం, ప్రజాసంక్షేమం కోసం పనిచేసే అవకాశం బీఆర్ఎస్ ద్వారా దక్కుతుందని చెప్పారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు సాధించే దిశగా బీఆర్ఎస్ పనిచేస్తుందని, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు తాము సదా సన్నద్ధంగా ఉన్నామని పల్లా పేర్కొన్నారు.