హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘రాజ్యాంగ సవరణ ద్వారానే 42% బీసీ రిజర్వేషన్ల హామీ అమలు సాధ్యం. ఇతర ఏ మార్గాల ద్వారా అసాధ్యం. ఇదే విషయం తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో తేటతెల్లమైంది’ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని మొదటి నుంచి బీఆర్ఎస్ చెప్తూనే వస్తున్నదని దుయ్యబట్టారు. అయినా గత 15 నెలలుగా కాంగ్రెస్ సర్కారు దురుద్దేశపూర్వకంగా అడుగులు వేసిందని మండిపడ్డారు.
బీసీల రిజర్వేషన్ల విషయంలో నిబద్ధతతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ ప్రయత్నం చేయలేదని ధ్వజమెత్తారు. దేశాన్ని, రాష్ర్టాలను సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టు ఆదేశాల తెలియవని అనుకోవడం పొరపాటేనని చెపపారు. అన్నీ తెలిసే బీసీలను మోసం చేసే ఎత్తుగడలో భాగంగానే కాంగ్రెస్ సర్కార్ ఇన్ని డ్రామాలు ఆడిందని నిప్పులు చెరిగారు. బీసీ రిజర్వేషన్ల అమలు కావాలంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని సూచించారు.
ఇదే విషయాన్ని కాంగ్రెస్ సర్కారుకు తాము చెప్పినప్పటికీ, సీఎం రేవంత్‌రెడ్డి పెడచెవిన పెట్టారని విమర్శించారు. ప్రతిపక్షాల సూచనలకు భిన్నంగా సర్కారు నడుచుకుందని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ వైఖరిని కోర్టులు తప్పుబడుతూ, కేసులు కొట్టి వేస్తున్నాయని దుయ్యబట్టారు. బీసీలపై కాంగ్రెస్ ఆలోచలన్నీ మోసపూరితమేనని, ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే తెల్చుకుంటామని హెచ్చరించారు. అందులో భాగంగానే ఈ నెల 18న అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు బీసీ బంద్‌నకు అన్నివర్గాలు మద్దతుగా నిలిచి జయప్రదం చేయాలని కోరారు.