ఖైరతాబాద్, ఆగస్టు 29: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో యుద్ధమే జరుగుతుందని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని హోటల్ సెంట్రల్ కోర్ట్‌లో గురువారం జరిగిన బీసీ కులసంఘాల అఖిలపక్ష సమావేశంలో ఆర్ కృ ష్ణయ్య మాట్లాడారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు కులగణన చేసి 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాం డ్ చేశారు. ఓ వైపు లోక్‌సభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రాహుల్‌గాంధీ బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని, కులగణన చేపడుతామని ప్రకటనలు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. కులగణన చేపట్టకుండా స్థానిక ఎన్నికలను నిర్వహిస్తే సీఎం రేవంత్‌రెడ్డికి బీసీలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
బీసీలు పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోవాలని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ లాల్ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నాయకుడు ఎల్ రమణ, మాజీ ఎంపీ వీ హన్మంతరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.