తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 25: రిజర్వేషన్ల విషయంలో బీసీలకు కాంగ్రెస్ సర్కార్ మరోసారి నమ్మకద్రోహం చేసిందని శాసనమండలిలో ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. కాంగ్రెస్ బీసీలకు చేసిన నయవంచనకు, ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవాలని, పంచాయతీ ఎన్నికల్లో ఓటుతోనే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
బీసీలకు ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ విఫలమైందని నిరసిస్తూ బీసీ జనసభ ఆధ్వర్యంలో హైదరాబాద్ గన్‌పార్కులో, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడారు. కులగణన మొదలు 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ బిల్లు పెట్టేంతవరకు సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడా చిత్తశుద్ధి చూపలేదని విమర్శించారు.
బీసీలు ఐక్యంగా ఉండి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీసీల గొంతుకోసి స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని బీసీ జనసభ అధ్యక్షుడు డీ రాజారామ్‌యాదవ్ ధ్వజమెత్తారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సీఎం రేవంత్‌రెడ్డికి ఇష్టమే లేదని చెప్పారు. ఈ కార్యక్ర మంలో పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ వీజీఆర్ నారగోని, ప్రముఖ సినీ దర్శకుడు ఎన్ శంకర్, సేవాలాల్ సంఘం అధ్యక్షుడు సంజీవ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.