హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): చట్టసభల సాక్షిగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి దగా చేసిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచకుండా బీసీలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతున్నదని మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్గౌడ్తో కలిసి మధుసూదనాచారి మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ, మండలిలో తప్పుల తడకగా మారిన కులగణన సర్వేను ప్రవేశపెట్టిన ఫిబ్రవరి 4 బీసీలకు దుర్దినమని, బీసీ హక్కుల హననమైన రోజని అభివర్ణించారు. అసెంబ్లీలో, మండలిలో తమ గొంతు నొక్కారని విమర్శించారు. ఒక సామాజిక వర్గం జనాభా పెరిగినట్టుగా చూపారని, ఆ తప్పును ప్రభుత్వం సవరించుకుంటుందని భావిస్తున్నామని చెప్పారు. ఆ సర్వే నివేదికను రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు అంగీకరించడం లేదని చెప్పారు. ఎన్నికల కమిషన్ జాబితా, ఇతర అధికారిక గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో మొత్తం జనాభా 4 కోట్లకు పైనే ఉంటుందని చెప్పారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనలో సంఖ్యను తకువ చేసి చూపారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెడతారని తాము ఆశిస్తే, ప్రభుత్వం అలా చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ కుట్రపై బీసీలకు న్యాయం జరిగేవరకు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుందని చెప్పారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు కోసం బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
కాంగ్రెస్ బీసీల వ్యతిరేకి :గంగుల
కాంగ్రెస్ పార్టీ తొలినాళ్ల నుంచే బీసీల వ్యతిరేకి అని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. కులగణన రిపోర్టు ఓ బోగస్ అని, ఇలాగే అశాస్త్రీయంగా చేసిన బీహార్ కులగణనను పాట్నా హైకోర్టు కొట్టేసిందని గుర్తుచేశారు. బీసీ కమిషన్ ద్వారా కాకుండా ప్లానింగ్ శాఖ ద్వారా చేస్తేనే అక్కడి కోర్టు కొట్టేసిందని, తెలంగాణలో కూడా అలాంటి పొరపాటే చేశారని, ఇది న్యాయస్థానంలో నిలబడదని చెప్పారు. గతంలో వివిధ బీసీ కమిషన్లు ఇచ్చిన నివేదికనలను ప్రభుత్వం కనీసం పరిగణనలోకే తీసుకోలేదని విమర్శించారు. అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి తమ నోరునొక్కారని, బుల్డోజ్ చేస్తే భయపడటానికి తాము గొర్రెలమా? అని ప్రశ్నించారు.
సగం ఇండ్లకు సర్వే సిబ్బందే వెళ్లలేదని విమర్శించారు. ‘అసెంబ్లీ ఎందుకు పెట్టినట్టు? బీసీల కోసం ఏమైనా చట్టం చేశారా? ఎందుకు ఇంత హడావుడి? నెల రోజులు టైమ్ అయినా తీసుకోండి. బీసీల సంఖ్య సరిగా చెప్పండి. ఏదో ఒకరోజును సర్వే కోసం కేటాయించి, 15 రోజుల్లో రీసర్వేను మొదలుపెట్టాలని ప్రభుత్వానికి గంగుల సూచించారు. ఏ ఒక్క బీసీ సంబరంగా లేడని, కేవలం గాంధీభవన్‌లోనే సంబురాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కులాలవారీగా జనాభా ఎంతో బయట పెట్టాలని, అలా చేయకుండా ఎన్నికలకు వెళ్తే తెలంగాణ భగ్గుమంటుంది’ అని గంగుల హెచ్చరించారు.
రేవంత్ క్యాబినెట్లో బీసీ మంత్రులెందరు?: ఎల్ రమణ
సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో బీసీ మంత్రులెందరున్నారని ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రశ్నించారు. ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ తక్కువ టికెట్లు కేటాయించిందని విమర్శించారు. అదికూడా ఓడిపోయే స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వీ హనుమంతరావు లాంటి ఎందరో నేతలు జీవితాలను అంకితం చేశారని, కానీ అలాంటి వారికి సరైన అవకాశాలను ఆ పార్టీ ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పరంగా 42 శాతం టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పడం బీసీలను దగా చేయడమేనని, రిజర్వేషన్లకు చట్టబద్ధత చేసే వరకు కాంగ్రెస్‌ను వదలబోమని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి బీసీలను సమాయత్తం చేస్తామని చెప్పారు. దశాబ్దాలుగా జరిగిన తప్పులను సరిదిద్దుతామని ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ చట్టసభల సాక్షిగా బీసీలను మళ్లీ మోసం చేసిందని ఎల్ రమణ ధ్వజమెత్తారు.
రేవంత్ నటనను బీసీలు నమ్మబోరు: విప్ కేపీ వివేకానంద
ఫిబ్రవరి 4.. తెలంగాణ సోషల్ జస్టిస్ డే కాదు.. ఇన్ జస్టిస్ డే. బడుగు బలహీన వర్గాలకు ఇది చీకటిరోజు.. అని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో బాగా నటించారని, కానీ ఆయన నటనను బీసీలు ఎవరూ నమ్మబోరని స్పష్టంచేశారు. 1952లోనే బడుగు బలహీన వర్గాల కోసం ఖేలర్ కమిటీ మంచి సూచనలు చేసిందని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. నీలం సంజీవరెడ్డి నుంచి రేవంత్‌రెడ్డి వరకు కాంగ్రెస్ సీఎంలందరూ బీసీలను మోసం చేస్తూ వచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజీవ్‌గాంధీ పార్లమెంట్లో ఓబీసీ రిజర్వేషన్లకు, కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడాడారని, ఈ రికార్డులు బయట పెడతామని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు తప్పుడు సర్వేతో బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సమాజం రేవంత్‌రెడ్డికి తప్పక గుణపాఠం చెప్తుందని హెచ్చరించారు. బీసీలకు జరిగిన అన్యాయంపై కేసీఆర్‌తో చర్చించి ఉద్యమం చేపడతామని చెప్పారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మోసం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని మాట తప్పిన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెట్టి బీసీల రిజర్వేషన్లను పెంచుతామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. పార్టీ పరంగా 42 శాతం సీట్లిస్తామని కాంగ్రెస్ పార్టీ నయా మోసానికి తెరలేపింది. ఇతర పార్టీలు కూడా బీసీలకు 42 శాతం సీట్లివ్వాలని సీఎం చాలెంజ్ చేయడం సిగ్గుచేటు. బీసీ రిజర్వేషన్లు అనేవి కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాదు. చట్టబద్ధత కూడిన రిజర్వేషన్లను అమలు చేస్తే అన్నింట్లో బీసీలకు రిజర్వేషన్లు అమలవుతాయి.
– పెద్ది సుదర్శన్‌రెడ్డి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే
బీసీలను దగా చేసిన కాంగ్రెస్ సర్కార్
బీసీలను కాంగ్రెస్ సర్కార్ నిలువునా ముంచింది. జనాభా పరంగా దక్కాల్సిన రిజర్వేషన్లను అందకుండా చేసింది. నాటి ప్రధాని నెహ్రూ సైతం బీసీలను మోసం చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో ఇప్పటివరకు విద్యా, ఉద్యోగ రంగాల్లో మాత్రమే 27శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. చట్టసభల్లో అమలు చేయకుండా ద్రోహం చేశారు. కుల గణన పేరుతో బీసీలను మోసం చేసేందుకు కుట్రలు చేసింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకపోతే ప్రభుత్వం మెడలు వంచి తీరుతాం.
– పుట్ట మధూకర్, మంథని మాజీ ఎమ్మెల్యే