సూర్యాపేట : రాష్ట్రంలో విద్యార్థినుల ఆత్మహత్యలు(Student suicides) ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం సీరియస్గా తీసుకొని తక్షణమే సమీక్ష నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)అన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట గురుకుల పాఠశాల విద్యార్థిని అస్మిత(Asmitha family) కుటుంబాన్ని మంగళవారం వారి స్వగ్రామమైన మోతె మండలం బురకచర్లలో పరమార్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖకు మంత్రే లేరని విమర్శించారు.
హాస్టల్స్ నిర్వహణలో పర్యవేక్షణ లోపం కనిపిస్తుందన్నారు. ప్రతి హాస్టల్లో ఫ్రెండ్లీ నేచర్ కల్పించాలని కవిత సూచించారు. ప్రతి హాస్టల్లో సైకాలజిస్టులను ఏర్పాటు చేసి విద్యార్థులల్లో మనోధైర్యాన్ని కల్పిం చాలని పేర్కొన్నారు. ఎలాంటి ఒత్తిడి నైనా తట్టుకునేలా విద్యార్థులను తయారు చేయాలని చెప్పారు. అస్మిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
తల్లిదండ్రులు కూడా పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెట్టవద్దని కోరారు. ఆత్మహత్యలపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ వెంటనే సమీక్ష నిర్వహించి ఆత్మహత్యల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. కవిత వెంట ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.