ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా. తెలంగాణకు నీ కాంట్రిబ్యూషన్ ఏంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటమా? బిడ్డా.. చెప్తున్న.. ఎన్నికల్లో ఎక్కడికిపోతవో..పో, వెంటబడి ఓడిస్తా. ఇట్లనే మాట్లాడినవనుకో ఊరుకోం. ఒక ఆడబిడ్డతోని ఇన్ని మాటలు అనిపించుకున్నవంటే.. రాజకీయాలను ఎంతగా భ్రష్టు పట్టిస్తున్నవో అర్థమవుతున్నది.
– ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ‘అర్వింద్.. గుర్తుపెట్టుకో..ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా..’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఎవరిపైనైనా హద్దుమీరి ఎంతబడితే అంత మాట్లాడితే సహించమని స్పష్టంచేశారు. అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా, వెంటపడి ఓడిస్తానని ఆమె ప్రకటించారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె అర్వింద్ చేసిన నిరాధార వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లో హుందాగా ఉండాలని హితవు పలికారు. అర్వింద్ ఆటలు సాగనివ్వబోమని, ఆయన మోసాలపై ఇక చీటింగ్ కేసులు పెడుతామని హెచ్చరించారు.
ఇంకోసారి ఇలా మాట్లాడితే… చెప్పుతో కొడతా..
తన రాజకీయ, ప్రజాజీవితంలో ఇంతవరకు ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని.. ఇప్పటివరకు తాను కేవలం ఇష్యూ బేస్డ్‌గానే మాట్లాడానని ఎమ్మెల్సీ కవిత స్పష్టంచేశారు. ఇప్పుడు బాధతో అర్వింద్‌పై వ్యక్తిగతంగా స్పందించాల్సి వస్తున్నదని చెప్పారు. ఎంపీ అర్వింద్‌పై తాను చేసే వ్యాఖ్యలు ఇదే తొలిసారి.. ఇదే చివరి సారి అని పేర్కొంటూ ఘాటుగా స్పందించారు. ‘నేను 2006 నుంచి 2022 వరకు ఏ ఒక్క వ్యక్తినీ పర్సనల్‌గా తిట్టలేదు. ఎప్పుడూ ఇష్యూ మీదనే మాట్లాడిన.. చాలాసార్లు విలేకరులు హైప్ కోసం మాట్లాడమని అడుగుతరు. కానీ, నేనొక్కటే ఒక్కటే చెప్పిన. ఇష్యూ మీద మాట్లాడుతానే తప్ప వ్యక్తి మీద మాట్లాడనని చెప్పిన. కానీ ఇవ్వాళ వ్యక్తి మీద వ్యక్తిగతంగా చెప్తున్నా.. అర్వింద్ గుర్తుపెట్టుకో.. ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా!.. తమాషాలు అవుతున్నయా చూస్తూ ఊరుకుంటుంటే.. భాష లేదు. పద్ధతిలేదు. మాట మీద గౌరవం లేదు.
కేసీఆర్ మీద గౌరవం లేదు. ఏం చేసినవ్? తెలంగాణకు నీ కాంట్రిబ్యూషన్ ఏంది? ఎందుకోసం ఇట్ల మాట్లాడుతున్నవ్? ఎవరిమీద పడితే వారిమీద, ఎంతబడితే అంత మాట్లాడితే చూస్తూ ఊరుకుంటం అనుకున్నవా? బిడ్డా.. చెప్తున్న..! ఎన్నికల్లో ఎక్కడికిపోతవో పో.. వెంటబడి ఓడిస్తా నిన్ను. ఇట్లనే మాట్లాడినవనుకో.. మామూలుగా ఉండదు. రాజకీయం చెయ్, కానీ ఇట్ల పిచ్చి వేషాలెయ్యకు. మాటలు రావు అనుకోకు. పాలిటిక్స్‌లో మర్యాద ఉండాలె. దిగజారొద్దు. ఒక ఆడబిడ్డతోని ఇంతమాట అనిపించుకున్నవంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను ఎంతగా భ్రష్టుపట్టిస్తున్నవో అర్థమవుతున్నది. ఇది చెప్పటానికే వచ్చిన’ అని ఆమె పేర్కొన్నారు.
బురదలో రాయేసినట్టేనని..
ప్రజాజీవితంలో ఉన్నప్పుడు నీతి, నిజాయితీ ఉండాలని.. అవేవీ అర్వింద్‌కు లేవని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. సీఎం కేసీఆర్‌పై అనరాని మాటలు, చెత్త ఆరోపణలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అర్వింద్ లాంటి చెత్త మనిషి, చెత్త ఆలోచనలు రాజకీయాలకు అవసరమా? ఇటువంటి రాజకీయాలు తెలంగాణకు అవసరమా? అని ఒక్కోసారి అనిపిస్తున్నదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. బాధతోనే తాను ప్రెస్‌మీట్ పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. అర్వింద్ బురదలాంటి వాడని, ఆ బురదలో రాయివేస్తే మనమీదే మరకపడుతుందని భావించినందునే తాను ఇంతకాలం మాట్లాడలేదని ఆమె చెప్పుకొచ్చారు.
అర్వింద్‌పై చీటింగ్ కేసులు
తనను ఎంపీగా గెలిపిస్తే నిజామాబాద్‌లో పసుపుబోర్డు తెస్తానని బాండ్‌పేపర్ రాసిచ్చి మోసం చేసిన అర్వింద్‌పై పసుపు రైతులు చీటింగ్ కేసులు పెట్టబోతున్నారని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. అర్వింద్ విద్యార్హతలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన సర్టిఫికెట్ ఫేక్ అని తేలిందని, ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నామని ఆమె తెలిపారు. పసుపు రైతుల్ని మోసగించినందుకు అర్వింద్.. వాళ్ల కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరాలని ఆమె డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో మహేందర్‌రెడ్డి అనే రైతు 25 ఏండ్లుగా పసుపు బోర్డు కోసం చెప్పులేసుకోకుండానే పోరాటం చేస్తున్నారని, తాను పసుపు రైతుల కోసం ఏదైనా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నది ఆయన వల్లేనని ఎమ్మెల్సీ కవిత ఉదహరించారు.
ప్రవర్తన, పనితీరు రెండూ లేని నాయకుడు
ప్రవర్తన లేని, పార్లమెంట్లో పెర్ఫార్మెన్స్ లేని నాయకుడు అర్వింద్ అని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. పార్లమెంట్లో ఒక్కో సభ్యుడు నాలుగు సంవత్సరాల కాలంలో సగటున 20 ప్రశ్నలు, డిబేట్లతో పాల్గొంటే.. అర్వింద్ కేవలం 5 చర్చల్లో మాత్రమే పాల్గొన్నారని ఆమె వివరించారు. అలాగే రాష్ట్ర ఏంపీలు సగటున 156 ప్రశ్నలు అడిగితే.. అర్వింద్‌ది కేవలం 66 ప్రశ్నలే అడిగారని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్‌లో సగం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ 54 డిబేట్లలో పాల్గొంటే.. అర్వింద్ కేవలం 5 డిబేట్లల్లోనే పాల్గొన్నారని ఆమె తెలిపారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి నాలుగేండ్లలో 266 ప్రశ్నలు అడిగితే అర్వింద్ 66 మాత్రమే అడిగారని కవిత చెప్పారు. పార్లమెంట్లో పర్ఫార్మెన్స్ సున్నా ఉన్న ఎంపీ అర్వింద్ అని ఆమె విమర్శించారు.
చిన్న మనసు, చిల్లర మాటలు
అర్వింద్‌వి చిన్న మనసు, చిల్లర మాటలని కవిత ధ్వజమెత్తారు. అత్యంత హేయమైన భాషను వాడుతూ.. రాజకీయాలకు ఏమాత్రం సరిపోని నాయకుడు అర్వింద్ అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలోని అన్నదమ్ములు, అక్కచెల్లెండ్లు అందరికీ ఆణిముత్యం అర్వింద్ ప్రవర్తన తెలుసునని అన్నారు. చిల్లర మాటలు, విచిత్రమైన చేష్టలతో నిజామాబాద్ పేరును పాడు చేస్తున్న వ్యక్తి అర్వింద్ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనేం మాట్లాడినా ఇంతవరకు తాను పట్టించుకోలేదని, మితిమీరి వ్యక్తిగత ఆరోపణలకు దిగినందునే మాట్లాడాల్సి వస్తున్నదని స్పష్టంచేశారు. 2018లో తనమీద 186 మందిని అభ్యర్థులుగా నిలిపి.. కాంగ్రెస్ సంపూర్ణ మద్దతుతో గందరగోళం సృష్టించి ప్రమాదవశాత్తు అర్వింద్ ఎంపీగా గెలిచారని కవిత చెప్పారు. గెలిచిన తర్వాత ఆ 186 మందిని బీజేపీలో చేర్చుకున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు.