కేసీఆర్‌తో పెట్టుకున్నవారు బాగుపడలేదు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరిక
కామారెడ్డి, ఫిబ్రవరి 24: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిస్తే, అబద్ధాలు చెప్పడంలో బీజేపీ నంబర్ వన్‌గా ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో ఎవరికి ఏమిచ్చారో చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగితే, ఇప్పటివరకు ప్రధాని మోదీతోపాటు బీజేపీ నేతలెవరూ సమాధానం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఎనిమిదేండ్లుగా రాష్ర్టాభివృద్ధి కోసం కట్టుబడి సీఎం కేసీఆర్ సహనంతో ఉన్నారని, తమ సహనాన్ని బలహీనతగా భావించొద్దని బీజేపీని హెచ్చరించారు. తమ జోలికి వస్తే ఢిల్లీకి వచ్చి డిస్టర్బ్ చేస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌తో పెట్టుకున్నవాళ్లెవరూ బాగుపడలేదని అన్నారు. టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎంకే ముజీబుద్దీన్ ప్రమాణస్వీకార కార్యక్రమం జిల్లా కేంద్రంలోని సత్యా గార్డెన్లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ను సవాల్ చేయాలంటే ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని అన్నారు.
రైతులకు సున్నం పెడుతున్న ప్రధాని మోదీ
రైతులకు మనం అన్నం పెడితే.. ప్రధాని మోదీ సున్నం పెడుతున్నారని కవిత విమర్శించారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడుతున్నా బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. కరోనా ఉధృతిలో కూడా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆపలేదని గుర్తుచేశారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో సంక్షేమ పథకాలు ఎందుకు అమలుచేయడంలేదని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి నలుగురు, కాంగ్రెస్‌లో ముగ్గురు, ఎంఐఎంకు ఒక ఎంపీ ఉన్నా రాష్ట్ర హక్కుల కోసం టీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే పార్లమెంట్లో కొట్లాడుతున్నారని చెప్పారు. కేంద్రం నుంచి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కింద రూ.900 కోట్లు రావాలని, దీనిపై ప్రతిపక్ష ఎంపీలెవరూ మాట్లాడటం లేదని విమర్శించారు. పసుపుబోర్డు గురించి నోరెత్తడంలేదని ఆరోపించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏమయ్యాయని నిలదీశారు. బీజేపీ దొంగమాటలు చెప్పడంలో నంబర్ వన్ అని కవిత మండిపడుతూ ఏఏ రంగాల్లో బీజేపీ నంబర్ వన్‌గా ఉన్నదో చెప్పారు.