ములుగు: ములుగు జిల్లా రామానుజపురంలో జరుగుతున్న ఎరుకల నాంచారమ్మ జాతరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (Kavitha) హాజరయ్యారు. నాంచారమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎరుకల నాంచారమ్మ జాతర సందర్భంగా ఎరుకల సోదరీ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎరుకల ఆత్మగౌరవం కోసం 6 గంటలు ప్రయాణించి హైదరాబాద్ నుంచి ఈ జాతరకు వచ్చానని చెప్పారు. జాతర ప్రభుత్వం చేయూతనివ్వాలని, మంత్రి సీతక్క ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎరుకల నాంచారమ్మ జాతర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఆలయ నిర్మాణంలో తమ పాత్ర కూడా ఉంటుందని తెలిపారు. అత్యంత వెనుకబడిన ఎరుకల సామాజిక వర్గం నుంచి పారిశ్రామికవేత్తలు కావాలని ఎరుకల ఎంట్రప్రెన్యూర్షిప్ను కేసీఆర్ అమలు చేశారని వెల్లడించారు.
అంతకుముందు ఆలయం వద్ద తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం అధ్యక్షుడు లోకిని రాజు, కేతిని రాజశేఖర్, లోకిని సమ్మయ్య, మానపాటి రమేష్, ఇతర ఆదివాసీ ఎరుకల సంఘం నాయకులు కవితకు ఘనంగా స్వాగతం పలికారు. ఎరుకల కులస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.