ఖలీల్‌వాడి, ఆగస్టు 7: కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలను మరిచిపోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చి గాడిలో పెట్టిన మహోన్నత వ్యక్తి పీవీ అని కొనియాడారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బ్రాహ్మణ సమాజం ఏర్పాటుచేసిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి, కుమారుడు ప్రభాకర్‌రావుతో కలిసి కవిత సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన సందర్భంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని వివరించారు.
బహుళజాతి కంపెనీల పెట్టుబడులు ఆకర్షించేందుకు ధైర్యంగా చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆనాడు పీవీ తీసుకున్న చర్యలతో ఈరోజు లక్షలాది మంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయని, కోట్లాది కుటుంబాలు దారిద్య్రరేఖ నుంచి పైకి ఎగబాకాయన్న విషయం దేశం ఎప్పటికీ మరిచిపోదని స్పష్టం చేశారు. కానీ అటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి మరిపించే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ తెలంగాణ బిడ్డను గుర్తించకపోతే సీఎం కేసీఆర్ గుర్తించారని, పట్టుదలతో శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారని చెప్పారు. పీవీ ఆలోచనా విధానాన్ని ఒక ఉద్యమంలా ప్రతి తెలంగాణ బిడ్డ గుండెకు తట్టేలా చాటి చెప్తామని, ప్రపంచానికి పీవీ స్ఫూర్తిని పంచుతామని పేర్కొన్నారు.
మహోన్నతమైన వ్యక్తి పీవీ
మహోన్నతమైన వ్యక్తి పీవీ నరసింహారావు అని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. పీవీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని, ఆయన చరిత్రను చదవాలని, ఆయన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ అపర భక్తుడని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. బ్రాహ్మణ సంక్షేమ కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా బ్రాహ్మణ నిరుపేదలకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి రూ.20 లక్షలు అందజేస్తున్నారని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ తెలంగాణ ఠీవీ అని ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత ఆయనదేనని చెప్పారు. కార్యక్రమంలో మహిళా ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ ఆకుల లిలత, జడ్పీ చైర్మన్ విఠల్‌రావు, బీఆర్ఎస్ పార్టీ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.