ఖైరతాబాద్, డిసెంబర్ 28: బీసీలకు ఎమ్మెల్సీ కవిత అండ గా ఉంటానంటే అవహేళన చేస్తారా? బీసీ ల పోరాటానికి ఆమె మద్దతిస్తే వ్యతిరేకిస్తారా? ఆమె వైఖరిపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్య లు గర్హనీయం.. అని యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నేత దుగుట్ల నరేశ్‌కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తక్షణమే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, చిత్తశుద్ధి ఉంటే బీసీల సమస్యపై తమ పార్టీ అధిష్ఠానాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. మరోసారి ఎమ్మెల్సీ కవితపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే కులగణన చేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికలనాటికి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో హామీ ఇచ్చిందని చెప్పారు. ఏడాది పూర్తయినా ఇంకా ఆ ప్రక్రియనే పూర్తి చేయలేదని విమర్శించారు.
ఈ దశలో ఎమ్మెల్సీ కవిత బీసీల సమస్యలను లేవనెత్తుతూ, తమకు మద్దతుగా నిలిస్తే ఆమెను అవహేళన చేయ డం శోచనీయమని పేర్కొన్నారు. అన్ని కులాలు, వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై కవిత చట్టసభల్లో లేవనెత్తుతున్నారని, తెలంగాణలో ఏ వర్గం ప్రజలకు కష్టమొచ్చినా వారికి ఆమె అండగా నిలబడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ బీసీల సంక్షేమానికి అనేక పథకాలను తీసుకొచ్చిందని, అన్ని వృత్తులకు చేయూతనిచ్చిందని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ర్టాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాల హయాంలో కేవలం 19 గురుకులాలను తీసుకొస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2,775 గురుకులాలను నెలకొల్పారని వివరించారు. దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఎమ్మెల్యే శ్రీనివాస్‌ను నరేశ్‌కుమార్ ప్రశ్నించారు. సమావేశంలో యూపీఎఫ్ నాయకులు విజయేంద్ర సాగర్, పెద్దాపురం కుమారస్వామి, జల్లా నరేందర్, ఎం.వెంకటేశ్ పాల్గొన్నారు.
కవిత నాయకత్వంలోనే బీసీలకు న్యాయం ;బీసీ కులాల రాష్ట్ర నాయకుడు హరిప్రసాద్
తెలంగాణచౌక్, డిసెంబర్ 28 : ఎమ్మెల్సీ కవిత నాయకత్వంలోనే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ కులాల రాష్ట్ర నాయకుడు గుంజపడుగు హరిప్రసాద్ పేరొన్నారు. శనివారం కరీంనగర్‌లోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో బీసీ సంఘాల మద్దతు చూసిన తరువాత కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన మొదలైందని అన్నారు. అందుకే అనాలోచితంగా కవితపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కవితపై చేసిన వ్యాఖ్యలను యావత్ బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. రాష్ట్రంలో 130 బీసీ కులాలుంటే కవితతో జరిగిన సమావేశంలో 70 శాతం బీసీ కులాల వారు హాజరైనట్టు తెలిపారు.
కవిత నాయకత్వంలో బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతును ప్రకటించినట్టు చెప్పారు. బీసీల నుంచి కవితకు వచ్చిన స్పందన చూసిన తర్వాతే కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కవిత బీసీ కాదని మాట్లాడే నాయకులు.. రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి బీసీ వర్గాలా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత బీసీ సంక్షేమం కోసం ముందుకు వచ్చినట్టు తెలిపారు. 70 ఏండ్లకుపైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్.. బీసీలకు న్యాయం చేయలేదని, కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీసీ కులాలకు సంక్షేమం జరిగిందంటే అది కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమైందని తెలిపారు. చేనేత, ముదిరాజ్, గొల్ల కుర్మలు, రజక, నాయీబ్రాహ్మణ కులాలకు కోట్లాది రూపాయలతో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ కవితపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే బీసీలు తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు.