నందిపేట, అక్టోబర్ 19: ‘తెలంగాణకు తీరని ద్రోహం చేసిందే కాంగ్రెస్. ఆ పార్టీ వల్లే తెలంగాణ చాలా నష్టపోయింది. సకల జనులంతా కలిసి సాధించుకున్న ప్రజా తెలంగాణపై మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదు’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివే రాహుల్‌గాంధీని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, కుటుంబపాలనపై ప్రియాంకాగాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. గురువారం ఆమె నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ రాహుల్‌గాంధీ ఆరోపించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
కాళేశ్వరం, మిషన్ భగీరథ వ్యయం కలిపితే రూ.లక్ష కోట్లలోపే ఉన్నదని, అలాంటప్పుడు లక్షల కోట్ల అవినీతి ఎలా చేస్తారని ప్రశ్నించారు. అవినీతి జరిగి ఉంటే, కమీషన్లు తీసుకుని ఉంటే చెరువులకు, రైతుల పొలాలకు సాగునీరు, ఇంటింటికీ తాగునీరు వచ్చేది కాదని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగింది కాబట్టి ఎస్సారెస్పీ ప్రాజెక్టు పూర్తి కావడానికి 60 ఏండ్లు పట్టిందని దుయ్యబట్టారు. తాము పారదర్శకంగా కష్టపడి పని చేశాం కాబట్టే పొలాల్లో నీళ్లు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ హక్కులపై రాహుల్‌గాంధీ ఏనాడూ పార్లమెంట్లో మాట్లాడలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌వి దొంగ వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలు, ఆపద మొక్కుల వాగ్దానాలని విమర్శించారు.
కాంగ్రెస్ వస్తే ధరణి గుళ్ల
ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపితే భూమికి హక్కుదారులెవరో ఎలా తెలియాలని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ పొరపాటున అధికారంలోకి వస్తే ధరణి మాత్రం గ్యారంటీగా గుళ్ల అవుతుందని చెప్పారు. ఈ ఎన్నికలు తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ ప్రేమికులకు మధ్య జరుగుతున్నవని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి పక్కా తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి అని మండిపడ్డారు. కాంగ్రెస్‌పై తిరగబడేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు.
2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి పదేండ్లపాటు నెరవేర్చకుండా వందలాది యువకుల బలిదానాలకు కాంగ్రెసే కారణమైందని విమర్శించారు. అప్పుడే రాష్ట్రం ఇచ్చి ఉంటే తెలంగాణ మరెంతో అభివృద్ధి అయ్యేదని చెప్పారు. ‘మీరు ఆర్మూర్ వస్తారట. సంతోషం. గుత్ప ఎత్తిపోతల పథకాన్ని రూ.25 కోట్లతో మరమ్మతు చేసుకున్నాం. ఫత్తేపూర్ సుప్రియాల లిఫ్ట్, మాక్లూర్ లిఫ్ట్.. ఇలాంటివాటికి రూ.350 కోట్లు ఖర్చు చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్ని చెరువులు నిండుకుండలా ఉన్నాయి. వాటిని ఒకసారి చూసిపోండి’ అని రాహుల్‌కు కవిత సూచించారు.