హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ‘ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి కవితను నేను’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో స్పందించారు. తాను పొలిటికల్ టూరిస్ట్‌ను కానని, తెలంగాణ ఉద్యమ బిడ్డను అని తేల్చిచెప్పారు. వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా బుధవారం చేసిన కామెంట్‌కు ఎమ్మెల్సీ కవిత ధీటైన సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్సీ కవితపై వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా నెటిజెన్లు మండిపడ్డారు. తాను బీజేపీ విడిచిన బాణమని వైఎస్ షర్మిల చెప్పకనే చెప్పుకున్నారని నెటిజెన్లు ఫైర్ అయ్యా రు.
బుధవారం ఉదయం ఎమ్మెల్సీ కవిత ‘తాము వదిలిన ‘బాణం’ తానా అంటే తందానా అంటున్న ‘తామర పువ్వులు’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై ‘పాదయాత్రలు చేసింది లేదు… ప్రజల సమస్యలు చూసింది లేదు. ఇచ్చిన హామీల అమలు లేదు…పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు’ అని వైఎస్ షర్మిల రీ ట్వీట్ చేశారు. దీంతో నెటిజెన్లు వైఎస్ షర్మిలపై భగ్గుమన్నారు. ఎమ్మెల్సీ కవిత తనదైన శైలిలో స్పందించారు.
‘అమ్మా.. కమల బాణం
ఇది మా తెలంగాణం
పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజా గణం
మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు
నేడు తెలంగాణ రూటు
మీరు కమలం కోవర్టు
ఆరెంజ్ ప్యారెట్టు
మీ లాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను
రాజ్యం వచ్చాకే రాలేదు నేను
ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి కవితను నేను’ అంటూ ట్వీట్ చేశారు.
షర్మిలపై నెటిజన్ల ఫైర్
ఎమ్మెల్సీ కవితపై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల బీజేపీ విడిచిన బాణం అని ఎమ్మెల్సీ కవిత అనకపోయినా షర్మిల తనకు తానే తాను బీజేపీ విడిచిన బాణం అని చెప్పుకున్నారని నెటిజన్లు ధ్వజమెత్తారు. ఆమె ఉద్యమం చేసే సమయంలో నువ్వెక్కడున్నావ్ అంటూ ఓ నెటిజన్ నిలదీశారు. ‘లోటస్పార్టీకి (బీజేపీకి) లోటస్ పాండ్ వత్తాసు పలకడం’ అని ఎద్దేవా చేశారు. ‘కమలం కోవర్టు.. ఆరెంజ్ ప్యారెట్టు’ అంటూ మరొకరు మండిపడ్డారు. ‘ఈ గులాబీ తోటలో పిడికిలి బిగించి లడాయి నడిపిన మహిళలున్నారు. ఆంధ్రా పాలకులకు ఎదురొడ్డి నిలిచి రణం సాగించిన వీర వనితలు ఉన్నారు. తెలంగాణ కోసం తమ శక్తిని కూడగట్టుకున్న అబలలు ఉన్నారు. కానీ అప్పుడు తెలంగాణకు నై అని ఇప్పుడు రాజకీయాల కోసం జై తెలంగాణ అన్న షర్మిలలాలు మాత్రం లేరు’ అని టీఎస్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్సీ కవిత చేసిన ఉద్యమ చిత్రాలను నెటిజన్లు ట్విట్టర్ వేదికగా షర్మిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.