మేం కేసీఆర్ సైనికులం. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల పక్షాన, ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. -ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
మంచిర్యాల, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు, బహుజనులు, దళితులు, గిరిజనులు, ఆదివాసీ వర్గాలన్నింటికీ అన్యాయం జరుగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరైనా గొంతెత్తి బాధితుల పక్షాన మాట్లాడితే, ప్రజల పక్షాన ప్రశ్నిస్తే రేవంత్‌రెడ్డి సర్కార్ అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నదని మండిపడ్డారు. కేటీఆర్‌పై రకరకాల కేసులు పెట్టి, ఏసీబీ పేరుతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ ప్రజలకు ఇచ్చినమాట నిలబెట్టుకోలేక ప్రతిపక్ష పార్టీ నాయకులపై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నదని, కేటీఆర్‌పై కేసులు అందులో భాగమేనని చెప్పారు.
జైనూర్ ఘటనలో సర్కార్‌ది మొద్దునిద్ర
తెలంగాణలో కేసీఆర్ అద్భుతమైన గురుకులాలు ఏర్పాటుచేశారని వాటిని సక్కగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కవిత పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో ఆడబిడ్డలకు కల్పించిన రక్షణలను ప్రభుత్వం కొనసాగించాల్సి ఉన్నదని, కానీ, దానికి విరుద్ధంగా ఆసిఫాబాద్‌లో రెండు ఘటనలు జరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. జైనూర్‌లో మహిళపై దాడి చేసి, లైంగికదాడికి యత్నం జరిగితే.. ప్రభుత్వ పెద్దలు ఎవరూ బాధ్యతగా నిలబడి, ప్రజలకు ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించలేదని మండిపడ్డారు. ఆ కారణంగానే హింస చెలరేగి పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందని చెప్పారు. ఈ ఘటనలో అన్ని వర్గాల ప్రజల దుకాణాలు పాడైపోయాయని, ఆస్తినష్టం జరిగిన ఏ ఒక్కరికీ ప్రభుత్వం నుంచి రూపాయి రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర ఎందుకు పోతున్నదని ప్రశ్నించారు. జైనూర్ ఘటనలో నష్టపోయిన అన్ని వర్గాలవారికి తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. షాపులు కాలిపోయిన అందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శైలజ కుటుంబానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి
వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్తో విద్యార్థిని శైలజ చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. శైలజ హైదరాబాద్ నిమ్స్‌లో ఉన్నప్పుడు తాను వెళ్లి పరామర్శించానని, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విషాహారం తిని చనిపోయిన పిల్లలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశామని గుర్తుచేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో బాధితురాలికి రూ.2లక్షలు ఇస్తామని తామే ప్రకటించామని వివరించారు. తాము అక్కడ ప్రకటించగానే ఆగమేఘాల మీద శైలజ ఇంటికి వచ్చి రూ.రెండు లక్షలు ఇస్తామని, ఆమె తండ్రికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని చెప్పారని తెలిపారు. కానీ, ఇప్పటివరకు ఆయనకు కాగితం కూడా ఇవ్వలేదని చెప్పారు. శైలజతోపాటు రాష్ట్రంలో 55 మంది పిల్లలు చనిపోతే వారికి న్యాయం చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. రేవంత్ పాలనలో ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతున్నారని, సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తుంటే కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. చాయ్ తాగినంత సమయంలో రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డికి.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి సమయం దొరక్క పోవడం, మనసు రాకపోవడం దారుణమని మండిపడ్డారు. కేజీబీవీల్లోని ఉపాధ్యాయులు, సర్వశిక్షా అభియాన్ ఉపాధ్యాయులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి నివాళులు
ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అక్కడినుంచి నార్నూర్ క్రాస్ రోడ్డు మీదుగా జైనూర్ మండలం దేవుగూడ గ్రామానికి వెళ్లారు. జైనూర్ ఘటనలో బాధితురాలైన ఆదివాసీ మహిళ మొస్రం నీలాబాయి కుటుంబాన్ని పరామర్శించారు. పూరిగుడిసెలోకి వెళ్లి మరీ ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందుతున్న తీరు, ప్రభుత్వ సహాయ సహకారాలపై ఆరా తీశారు. బాధిత కుటుంబానికి రూ.రెండు లక్షల చెక్కును అందజేశారు. అక్కడినుంచి ప్రమాదంలో గాయపడి నాలుగేండ్లుగా ఇబ్బందులు పడుతున్న జామ్ని మాజీ ఎంపీటీసీ, తెలంగాణ ఉద్యమకారుడు లట్పటే మాధవ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం కెరిమెరి మీదుగా వాంకిడి మండలం దాబా గ్రామానికి బయల్దేరి వెళ్లారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో విషాహారం తిని మృతిచెందిన శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా వాంకిడి సమీపంలో కవిత కాన్వయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. శైలజ చదువుకున్న ఆశ్రమ పాఠశాల ముందు నుంచి కాన్వాయ్ వెళ్లడానికి అనుమతి నిరాకరించిన పోలీసులు, వేరే మార్గంలో ఆమెను దాబా గ్రామానికి తీసుకెళ్లారు. శైలజ కుటుంబసభ్యులను పరామర్శించిన కవిత రూ.2 లక్షల చెక్కును ఆర్థిక సాయంగా అందజేశారు. పరామర్శకు వెళ్లిన సమయమంలో శైలజ తల్లి కవితను హత్తుకొని బోరున విలపించారు.
బైక్ ర్యాలీలు.. ఘన స్వాగతాలు..
ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్సీ కవిత పర్యటన సందర్భంగా అడుగడునా బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. నర్నూర్క్రాస్ రోడ్చ జైనూర్, కెరిమెరి, ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల్లో అద్భుతమైన రీతిలో స్వాగతం పలికారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోగానే పూలవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్‌జాదవ్, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఆదిలాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ జనార్థన్ రాథోడ్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్, టీబీజీకేఎస్ నాయకుడు మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీబీజీకేఎస్‌కు పూర్వ వైభవం
సింగరేణిలో టీబీజీకేఎస్‌కు పూర్వవైభవం వస్తుందని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తంచేశారు. ఆసిఫాబాద్ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి గోలేటిలో నిర్వహించిన కార్మికుల సమావేశంలో కవిత మాట్లాడుతూ.. తెలంగాణ అంటేనే సింగరేణి అని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కారుణ్య నియామకాలను పునరుద్ధరించారని చెప్పారు. ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా ఒప్పుకోలేదని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఎలా మోసం చేసిందో, సింగరేణి కార్మికులను అధికార పార్టీ కార్మిక సంఘాలు అంతకంటే ఎక్కువగా మోసం చేశాయని ఎద్దేవా చేశారు. బోనస్ విషయంలో 50% కోత పెట్టి కార్మికుల పొట్ట కొట్టినా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నోరుమెదపడం లేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు రూ. 12 వేలకు తగ్గించింది. రైతులకు రూ.15 వేలు ఇవ్వాల్సిందే. రూ.12 వేలు ఇచ్చి చేతులుదులుపుకుంటామంటే చూస్తూ ఊరుకోం.-ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత