హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు సహా తెలంగాణ సా ధకుడు, తొలి సీఎం కే చంద్రశేఖర్‌రావు తెలంగాణ దార్శనికులని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, పఠాన్‌చెరు నియోజకవర్గాలకు చెందిన పలువురు విద్యార్థులు, యువకులు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో శనివారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో జాగృతిలో చేరారు. అనంతరం దివంగత మాజీ ప్రధాని పీవీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బూతులు తప్ప మరొకటి మాట్లాడడం తెలియదని ఎద్దేవా చేశారు. ఆయన ఒక్కసారైనా ‘జై తెలంగాణ’ అని అనలేదని దుయ్యబట్టారు. యువత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఆడపిల్లల స్కూటీల కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని కవిత పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీ, వకీల్‌సాబ్ వంకర టింకరగా మాట్లాడుతున్నారని, బీసీ బిల్లు కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉన్నదని గుర్తు చేస్తూ, ఆ బిల్లును ఆమోదిస్తారా? లేదో? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి, పీసీపీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సమాజానికి క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ జాగృతితో సీపీఐ సాంస్కృతిక విభాగమైన యువ కళావాహిని కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నదని కేరళకు చెందిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సందోశ్కుమార్ తెలిపా రు. ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో మర్యాదపూర్వంగా కలిశారు. వివిధ దేశాల్లో యువ కళావాహిని, జాగృతి కలిసి పనిచేస్తాయని ప్రకటించారు.