మర్కూక్, ఫిబ్రవరి 17: బీసీ రిజర్వేషన్ల అంశాన్ని దృష్టి మరల్చడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసి డ్రామాలు చేస్తున్నాయని, కులగణన సర్వేలో బీసీల తప్పుడు లెక్కల చర్చను తప్పుదారిపట్టిండానికి మోదీ బీసీనా.. కాదా అన్న చర్చకు సీఎం తెరలేపారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 71వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లిలో సోమవారం గ్రామస్తులు, యువకులు, బీఆర్ఎస్ నేతలు కలిసి ఆయుష్ హోమం, సుదర్శన యాగం నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత యాగంలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ 14 నెలల పాలనలో ప్రజలకు నరకం చూపిస్తున్నదని మండిపడ్డారు. బీసీల సర్వే లెక్కలు సరిగా చేయలేక సీఎం రేవంత్‌రెడ్డి నాటకాలాడుతున్నారని ఆరోపించారు.
కులగణన పేరిట కాలయాపన చేశారే తప్ప లెక్కలు పూర్తిగా చేయలేదని విమర్శించారు. మోదీ బీసీ అయితే ఏందీ.. కాకపోతే ఏందీ, రాహుల్‌గాందీ ఏ మతం అయితే మాకేందీ.. ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి రెండోసారి బీసీ సర్వే నిర్వహిస్తున్నా దానిపై తగిన ప్రచారం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని, దానిని కేంద్రంలోని బీజేపీ సర్కారు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లు అమలు చేయకుండా రాహుల్‌గాంధీ మతం గురించి మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి వంకర టింకర మాటలతో ప్రజలను ఆగం చేస్తున్నారని, ఏ ఒక్క సమస్యకు పరిష్కరం చూపడం లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తన ప్రాణాన్ని, పదవులను పక్కనపెట్టి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కారుణజన్మడు కేసీఆర్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల బతుకులు ఆగం అవుతున్నాయని, కేసీఆర్ మళ్లీ సీఎంగా రావాలని రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజలు పూజలు చేస్తున్నారని ఎమ్మెల్యే కవిత తెలిపారు.
పాములపర్తిలో పూలవర్షం
ఎమ్మెల్సీ కవిత ఎర్రవల్లికి వెళ్తున్న క్రమంలో పాములపర్తిలో బీఆర్ఎస్ నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆమెపై గులాబీ రేకులతో పూలవర్షం కురిపించారు. వర్దరాజ్పూర్లో వరదరాజులస్వామి ఆలయాన్ని సందర్శించిన కవిత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కవిత బాగుండాలని గతంలో బీఆర్ఎస్ నేతలు కట్టిన ముడపును విప్పి స్వామివారికి మొక్కు చెల్లించారు. ఎర్రవల్లికి చేరుకుని కేసీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన ఆయుష్హోమం, సుదర్శన యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కవితకు ఎర్రవల్లి మహిళలు తిలకం దిద్ది మంగళహారతులు పట్టారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పాండు, రాంచంద్రం, కరుణాకర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, కనకయ్య, బాల్‌రాజు, కృష్ణ, మల్లేశం, బాబు, రాజిరెడ్డి, కృష్ణయాదవ్, సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.