గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతి చెందిన 24 గంటల్లోనే.. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బంగారు భవిష్యత్తుకై పుస్తకాల బ్యాగులు పట్టుకుని పాఠశాలకు వెళ్లిన పిల్లలు.. పురుగులు పట్టిన అన్నం తిని , బాధ భరించలేక కడుపు పట్టుకుని రోదిస్తుండటం చూసి ఓ తల్లిగా నా మనసు కలచి వేసిందని పేర్కొన్నారు.
ఇదే పాఠశాలలో కలుషితమైన ఆహారం తిని 30 మంది ఆసుపత్రిలో చేరిన వారం లోపే.. మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన జరగడం కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రతి పదిరోజులకు ఒక పసి ప్రాణం పోతున్నా కూడా సర్కారులో చలనం లేదని మండిపడ్డారు. ఇదేనా ప్రజా పాలన అంటే అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతి చెందిన 24 గంటల్లోనే.. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది.
బంగారు భవిష్యత్తుకై పుస్తకాల బ్యాగులు పట్టుకుని పాఠశాలకు వెళ్లిన పిల్లలు.. పురుగులు పట్టిన అన్నం తిని , బాధ భరించలేక కడుపు… pic.twitter.com/YH3V8x52SM
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 26, 2024
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్పాయిజన్ జరిగింది. మంగళవారం నాడు మధ్యాహ్న భోజనం తిని 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత పలువురు విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో విలవిలలాడిపోయారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.
మాగనూరు పీహెచ్సీలో విద్యార్థులకు చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న పలువురిని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మాగనూరులో ఫుడ్ పాయిజన్ జరగడం ఈ వారంలో ఇది మూడోసారి. దీనిపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.