హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ‘ఆంధ్రజ్యోతి’ది జర్నలిజమా? లేక శాడిజమా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. తనపై ఆ పత్రికలో తప్పుడు కథనాలు ప్రచురితం కావడంపై ఆమె తీవ్రంగా ఖండించారు. తనను సంప్రదించకుండా తనపైనే వ్యతిరేక వార్త ఎలా రాస్తారని ఆ పత్రిక యాజమాన్యంపై బుధవారం ఎక్స్ వేదికగా కవిత నిప్పులు చెరిగారు. ‘కాంగ్రెస్తో రాయబారం! హస్తం గూటికి చేరేందుకు కవిత యత్నాలు, మధ్యవర్తి ద్వారా అధిష్ఠానంతో సంప్రదింపులు’ వంటి శీర్షికలతో తనపై ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో వచ్చిన వార్తను తీవ్రంగా ఖండించారు. ఆ దినపత్రికలో వచ్చిన వార్తలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టంచేశారు. ఈ వార్త రాసే క్రమంలో కనీసం తనను సంప్రదించ లేదని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.