పెద్దపల్లి, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ)/కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన బీసీ కుల గణన లెక్కలనైనా పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలకు పోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కవిత సోమవారం కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించారు. ఆయా చోట్ల మీడియాతో మాట్లాడారు. జాగృతి ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమాలు, వివిధ బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు చేస్తున్న పోరాటాల ఫలితంగా ప్రభుత్వం బీసీ కుల గణనకు సంబంధించి డాటాను విడుదల చేసిందని చెప్పారు. దేశ చరిత్రలో ఎన్నడూ బీసీ కులగణన దేశవ్యాప్తంగా జరుగలేదని అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తాను నియమించిన బీసీ కమిషన్ ద్వారా కాకుండా ప్లానింగ్ కమిషన్ ద్వారా కులగణన సర్వే చేయించిందని చెప్పారు. బీసీ గణన సరిగ్గా జరుగలేదని ఆరోపించారు.
2011 నాటి జనాభా లెకల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇండ్లు, రాష్ట్ర జనాభా 3.50 కోట్ల మంది ఉన్నట్టు తెలిపారని కవిత గుర్తుచేశారు. 2014లో రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేలో 1.03 కోట్ల ఇండ్లు, 3.68 కోట్ల జనాభా ఉన్నట్టు తేలిందని అన్నారు. నాలుగేండ్ల వ్యవధిలోనే రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు పెరిగాయని చెప్పారు. అలాంటిది 2014-2024 వరకు పదేండ్లలో ఎన్ని ఇండ్లు, ఎంత జనాభా పెరగాలో..? ఆలోచించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న లెక్క ప్రకారం రాష్ట్రంలో 1.15 కోట్ల ఇండ్లు, జనాభా 3.70 కోట్లు ఉందని తెలిపారు. నాలుగేండ్లలో ఏడాదికి 6 లక్షల కుటుంబాల చొప్పున పెరిగితే, పదేండ్లలో కనీసం 60 లక్షల కుటుంబాలు పెరగాలని అంచనా వేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2023 వరకు కల్యాణలక్ష్మి చెక్కులే 13.78లక్షల కుటుంబాలకు ఇచ్చామని, ఈ లెక్కన కొత్తగా ఎన్ని కుటుంబాలు పెరిగాయో తెలుస్తున్నదని అన్నారు. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెప్తున్న లెక్కలు చూస్తే కనీసం 12 లక్షల కుటుంబాలు కూడా పెరిగినట్టు కనిపించడం లేదని అనుమానం వ్యక్తంచేశారు. నేషనల్ హెల్త్ మిషన్ ప్రతి రెండేండ్లకొకసారి చేపట్టే శాంపిల్ లెక్కల ద్వారా తెలంగాణలో 50 నుంచి 52 శాతం బీసీలు ఉన్నట్టు ప్రకటించారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 46.3 శాతం మాత్రమే ఉన్నట్టు లెక్కలు చూపిస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారు చేసిన బీసీ సర్వే లెక్కలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. వారు చేసిన 3.50 కోట్ల సర్వే పత్రాలను ప్రజల పరిశీలనకు అందుబాటులో పెట్టాలని అన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి, అసెంబ్లీ, కౌన్సిల్లో బిల్లు పాస్ చేసి బాజాప్తా రిజర్వేషన్లు ప్రకటించాలని అన్నారు.
జనాభా ప్రకారం రిజర్వేషన్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్తున్నారని, ఆ ప్రకారమే 46.3 శాతం బీసీలు, మరో 10 శాతం ఉన్న ముస్లిం బీసీలను కలుసుకొని మొత్తంగా 56.3 శాతం మందికి రిజర్వేషన్ అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ‘మీరెంతో..? మీకు అంత’ అని అంటూ రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్‌గాంధీ బీసీల విషయానికి వచ్చే సరికి ఎందుకు వెనక్కి పోతున్నారని నిలదీశారు. ఇదే మోసాన్ని కర్ణాటకలో, బీహార్‌లో చేశారని ఆరోపించారు. తెలంగాణ బీసీలు చైతన్యవంతులని అన్నారు. కాంగ్రెస్ సర్కారు చెప్పినవన్నీ కాకీ లెక్కలేనని, అయినా సరే ఆ లెక్కల ప్రకారమే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేశారు. ఈ లెక్కల గురించి ఎక్కువగా మాట్లాడితే తమపై నెపం నెట్టి ఎన్నికలను దూరం చేసే ప్రయత్నం చేస్తుందని హెచ్చరించారు.
కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే సర్వేలో మిస్ అయిన వారి జనాభాను నమోదు చేసుకొనే అవకాశం ఇవ్వాలని అన్నారు. కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చిన బీసీ జనాభాకు, ప్రస్తుత సర్వేకు బీసీలలో 21 లక్షలు తేడా కనిపిస్తున్నదని చెప్పారు. అప్పుడు ఓసీల సంఖ్య చాలా తక్కువగా అని, ఈసారి వారి సంఖ్య బాగా పెరిగిందని, ఇందులో మతలబు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఓసీల జనాభా పెరిగి బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా తగ్గుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి ప్రస్తుతం ప్రకటించిన జనాభా లెకల ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మాదిగలకు కూడా న్యాయం జరగాలన్నారు. వర్గీకరణపై కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు యథావిధిగా అమలు చేయాలని అన్నారు.
తెలంగాణకు నెత్తి మీద నీటి కుండ లాంటిది పెద్దపల్లి జిల్లా అని కవిత పేర్కొన్నారు. చిన్న మరమ్మతులతో బాగయ్యే మేడిగడ్డ బరాజ్‌ను కావాలనే కక్ష పూరితంగా పక్కన పెట్టారని విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో కేవలం 16 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, ఆ నీరు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఈ ప్రాంతంలోని పరిశ్రమల అవసరాలకే సరిపోతాయని, మరి సాగు నీటి పరిస్థితేంటో సమాధానం చెప్పాలని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, దాసరి మనోహర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోలేటి దామోదర్, చిరుమిల్ల రాఖేశ్, మూల విజయారెడ్డి, మాజీ మేయర్ రవీందర్‌సింగ్ తదితరులు ఉన్నారు.
బీసీలకు రాజకీయ సాధికారత వచ్చేంత వరకు, రాజకీయాల్లో బీసీలకు దక్కాల్సిన వాటా దక్కేంత వరకు తమ పోరాటం ఆగదని, ఈ ఉద్యమంలో జాగృతి ముందుంటుందని కవిత స్పష్టం చేశారు. బీసీ ఉద్యమాల్లో పని చేస్తున్న అందరు పెద్దలను కలుస్తామని, వారితో సమాలోచనలు చేస్తామని చెప్పారు. అనేక హామీలు ఇచ్చి, మోసపూరిత మాటలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పగలు, ప్రతీకార పాలన చేస్తున్నదని కవిత విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రజా సేవను పక్కన పెట్టి పగ తీర్చుకునే విధంగా ప్రభుత్వాలను నడుపుతున్నారని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు కలిసి ‘మేం కొట్టినట్టు చేస్తాం.. మీరు ఏడ్చినట్టు చేయాలన్నట్టుగా’ మొసలి కన్నీరు కారుస్తున్నాయని మండిపడ్డారు.