ఆదిలాబాద్: భూమి, భుక్తి, విముక్తి కోసం ఆదివాసులు పోరాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఆదివాసీల పోరాట స్ఫూర్తితో, ఉత్తేజంతో ముందుకు సాగుతామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లికి చేరుకున్న కవిత.. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో నాలుగున్నర లక్షల పోడుభూములకు పట్టాలు ఇచ్చామన్నారు. ఆదివాసి యోధులను గౌరవించుకున్నామని చెప్పారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కేసులకు భయపడరని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలతోపాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతున్నదని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం సందర్భం రైతు భరోసా కింద రూ.15 ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు రూ.12 వేలు ప్రకటించి రైతులను మోసం చేశారని విమర్శించారు. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యాకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ధర్నాలకు భయపడిన ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తున్నదని చెప్పారు. ప్రజాకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని పేర్కొన్నారు.