హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి 15 నెలల పాలనలో రూ.1.52 లక్షల కోట్ల అప్పులు తెచ్చారే తప్ప తెలంగాణను ఉద్ధరించిందేమీలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ‘ఒక్క పెద్ద ప్రాజెక్టు కట్టలేదు.. మంచి పథకాన్ని ప్రారంభించిందిలేదు.. కనీసం ఒక్క మహిళకు కూడా 2500 చొప్పున ఇవ్వలేదు’ అని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో కూర్చొని రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడి పరువుతీశారని మండిపడ్డారు. ‘గులాబీ కండువా నీడలో పేగులు తెగేదాకా కొట్లాడి.. జనమంతా ఏకమై బోనాలు మోసి.. బతుకమ్మలు ఎత్తి.. ఊరూరా నిరాహారదీక్షలు చేసి తెచ్చుకున్న తెలంగాణను.. ఉద్యమంతో సంబంధంలేదని రేవంత్‌రెడ్డి అవమానిస్తే సహించబోం’ అని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారులపై గన్నుపట్టుకొని ఎదురుతిరిగిన వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణభవన్‌లో సోమవారం మాజీ ఎంపీ మాలోతు కవిత, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, సుమిత్రా ఆనంద్, ఆలకుంట హరి, దత్తాత్రేయతో కలిసి కవిత విలేకరులతో మాట్లాడారు. ‘మా తెలంగాణ గొప్పగా ఉన్నది.. దేశంలో నంబర్ వన్‌గా ఉన్నది..’ అంటూ కేసీఆర్ అటు ఢిల్లీతోపాటు దేశవిదేశాల్లో గొప్పగా చెప్పిన్రు.. పదేండ్లు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన్రు..’ అని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రం అప్పుల పాలైందని, అభివృద్ధికి నెలకు రూ.500 కోట్లు కూడా వెచ్చించలేని పరిస్థితి ఉన్నదని చెప్పి దేశస్థాయిలో మన గౌరవాన్ని గంగలో కలిపారని విమర్శించారు. దరిద్రం ఆయన ఆలోచనలో ఉన్నది తప్ప తెలంగాణలో లేదని దెప్పిపొడిచారు.
అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
కాంగ్రెస్ 15 నెలల పాలనలో సగటున నెలకు రూ. 10 వేల కోట్ల చొప్పున రూ. 1.52 లక్షల కోట్లు అప్పులు చేశారని కవిత ఆరోపించారు. పరిస్థితి చూస్తుంటే మరో 35 నెలల్లో మరో రూ. 3.5 లక్షల కోట్లు అప్పులు చేసేటట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పదేండ్లలో రూ.4.38 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రూ.50 లక్షల కోట్ల విలువైన ఆస్తులు సృష్టించడమే గాకుండా నిరాటకంగా సంక్షేమాన్ని కొనసాగించారని చెప్పారు. ఇందుకు కళ్లెదుట కనిపిస్తున్న ప్రాజెక్టులే నిదర్శనమని అన్నారు. కాళేశ్వరానికి రూ.90 వేల కోట్లు, నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.1.35 లక్షల కోట్లు, మిషన్ భగీరథకు రూ.37 వేల కోట్లు, రుణమాఫీకి రూ.30 వేల కోట్లు, ఉచిత కరెంట్‌కు రూ.36 వేల కోట్లు, రైతుబంధుకు రూ.73 వేల కోట్లు, రైతుబీమాకు రూ.6,800 కోట్లు, విద్యుత్తు రంగంపై రూ.1.38లక్షల కోట్లు, ఆరోగ్య రంగంపై రూ.61 వేల కోట్లు, సంక్షేమానికి రూ.2.83 లక్షల కోట్లు ఖర్చుచేశారని సోదాహరణంగా వివరించారు. కానీ రేవంత్‌రెడ్డి అప్పులపై తప్పుడు లెక్కలు చెప్తున్నారని మండిపడ్డారు. పొద్దున లేస్తే కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి బడా కాంట్రాక్టర్ల జేబులు నింపి బడుగుల పొట్టగొట్టారని ఆరోపించారు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అప్పులపై వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనైనా స్పష్టత ఇవ్వాలి లేదంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్‌కు సబ్జెక్ట్లేదు..ఆబ్జెక్ట్ లేదు..
‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సామాజిక దృక్పథం లేదు. ఆర్థిక క్రమశిక్షణ లేదు.. వాగ్దానాలు నిలబెట్టుకోవాలనే నియ్యత్ లేదు.. భవిష్యత్‌పై దూరదృష్టి లేదు.. పేదవాడి కడుపు నింపాలనే ఆలోచన లేదు.. ఒక్క మాటలో చెప్పాలంటే సబ్జెక్ట్ లేదు..ఆబ్జెక్ట్ లేదు’ అంటూ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భభ్రజమానం భజగోవిందం అన్నచందంగా రాష్ట్రంలో పరిస్థితి ఉన్నదని అన్నారు. ‘అడిగినవారికి బెదిరింపులు.. ప్రశ్నిస్తే బుకాయింపులు.. భూములివ్వబోమన్న రైతులకు బేడీ లు.. కేసీఆర్‌పై నిత్యం చాడీలు’ తప్ప 15 నెల ల్లో సాధించేందేమీలేదని విమర్శించారు. కేసీఆర్ ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి చేస్తే రేవంత్ మాత్రం నయవంచనతో నమ్మించి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేకుంటే తెలుసుకోండి..ముఖ్యమంత్రికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన లేకుంటే నిపుణులను అడిగి తెలుసుకోవాలని, అంతేగాని అబద్ధాలు చెప్పవద్దని కవిత చురకలంటించారు. ఒక పక్క అభివృద్ధి పనులకు రూ.500 కోట్లు కూడా మిగలడం లేదని చెప్తూనే మరోపక్క మా పోటీ న్యూఢిల్లీతో కాదు.. న్యూయార్క్తోనే అనడం ఆయనకే చెల్లిందని అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి తెలంగాణను అవమానించకుండా నిలబెడితే ప్రతిపక్షంగా అండగా ఉంటామని ప్రకటించారు. జిల్లా సమాఖ్యలకు బస్సులు అప్పజెప్పి మహిళా సంఘాలందరికీ ఇచ్చినట్టు పోజులు కొట్టడం విడ్డూరమని అన్నారు. దీనిద్వారా వచ్చే ఆదాయం మహిళలకు తలా ఒక్కరూపాయి కూడా అందదని చెప్పారు. మహిళా బిల్లు ఆమోదంపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బీఆర్ఎస్ ఒత్తిడితోనే పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టారని స్పష్టం చేశారు.