హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌తో పాటు ఎన్నికల మ్యానిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన ఇతర హామీలను కాంగ్రెస్ సర్కార్ విస్మరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో తెలంగాణ వడ్డెర సంఘం నాయకులు బుధవారం కలిశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుపై బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు తెలంగాణ జాగృతి తరఫున నివేదిక సమర్పించినందుకు కవితకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ, ప్రతి జిల్లా కేంద్రంలో రూ. 50 కోట్లతో బీసీ ఐక్యత భవనాల ఏర్పాటుపై కనీస చర్యలు తీసుకోలేదని ఎండగట్టారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి తాత్సారం చేస్తున్నదని, కులవృత్తుల వారికి ప్రభుత్వం కనీస మద్దతు ఇవ్వడంలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు ఏతరి మారయ్య, అలకుంట సరస్వతి, గంటికోట హరికృష్ణ, కొమరాజుల శేఖర్, గంగాధర్, ఫలవు సత్యనారాయణ, కంచపు జగన్, శ్రీకాంత్, వరికుపాల సాయికుమార్, వేముల జనార్దన్, అలకుంట కుమార్, అలకుంట మల్లేశ్ పాల్గొన్నారు.