హైదరాబాద్ ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూములను కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో న్యాయవాదులు కోర్టుల్లో గట్టిగా పోరాడారని పేరొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పరిపాలన చేతగావడంలేదని దుయ్యబట్టారు. ఆయన దుశ్చర్యలతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని విమర్శించారు. బుధవారం ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ఆదాయం పడిపోవడం వల్లనే రేవంత్ ప్రభుత్వం భూముల అమ్మకానికి తెగబడుతున్నదని నిప్పులు చెరిగారు.
హెచ్‌సీయూకి వేరేచోట 397 ఎకరాలు ఇచ్చామని ప్రభుత్వం వితండవాదనకు దిగడం విడ్డూరంగా ఉందని పేర్కొంటూ.. ఆ భూముల్లోనే పరిశ్రమలను ఎందుకు ఏర్పాటు చేయడంలేదని ప్రశ్నించారు. పర్యావరణాన్ని కాడాల్సిన పాలకులే భూములను చెరబట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కంచె గచ్చిబౌలి ప్రాంతం ఇప్పటికే కాంక్రీట్ జంగల్‌కు కేరాఫ్‌గా ఉందని, అక్కడ పరిశ్రమల ఏర్పాటుతో మరింత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ‘మైహోం విహంగ’ నిర్మాణానికి భూములు కేటాయించినట్టు సీఎం రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. అదే నిజమైతే ఆ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ‘మైహోం’ సంస్థ అధినేత జూపల్లి రామేశ్వర్రావు బీజేపీకి చెందినవాడైనందున రేవంత్‌రెడ్డి ఆయన భూములను ముట్టుకొనే ధైర్యం చేయబోరని, పేదలతోపాటు మూగజీవులపైకి బుల్డోజర్లను పంపుతున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దోళ్లను మాత్రం ముట్టుకోవడంలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.