హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ పనులు మొదలుపెట్టగానే ప్రమాదం ఎలా జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో 10 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వినా ఏ ఒక రోజూ ఇలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు రోజుల కిందటే పనులు మొదలుపెట్టింది.
అంతలోనే పెను ప్రమాదం ఎలా జరిగింది? దీనికి బాధ్యులెవరు? ఈ ప్రమాదంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) స్పందించాలి. ప్రాజెక్టులో ఇంకా 9 కిలోమీటర్లకు పైగా సొరంగం తవ్వాల్సి ఉంది. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలి. కూలీలు గాయపడటం అత్యంత దురదృష్టకరం. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలి’ అని డిమాండ్ చేశారు.