హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అస్సాంలోని కామాఖ్య అమ్మవారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేడుకున్నారు. రాష్ర్టాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ అధికారంలోకి రావాలని ఆమె కోరుకున్నారు. సోమవారం అస్సాంలోని గౌహతిలో ఉన్న కామాఖ్య అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ కవితకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణతోపాటు దేశ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని, సీఎం కేసీఆర్ని మరోసారి భారీ మెజారిటీతో గెలిపిస్తారని స్పష్టం చేశారు. నాలుగైదేండ్ల క్రితం అమ్మవారిని దర్శించుకున్నానని, తాజాగా కామాఖ్య దేవిని పునర్దర్శించుకోవడం సంతోషంగా ఉందని కవిత చెప్పారు.