MLC Kavitha | తాము చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారని.. ప్రభుత్వ పెద్దల్లో వణుకు పడుతోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మాగునూరు జెడ్పీ హైస్కూల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తారని, ప్రజలతో కలిసి ఉద్యమిస్తారనే భయంతో తెల్లవారుజామునే అక్రమ అరెస్టులకు తెరలేపింది కాంగ్రెస్ సర్కార్ అంటూ ధ్వజమెత్తారు. ప్రజా పాలను అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు, ప్రజలు నిలదీస్తారనే భయంతో బీఆర్ఎస్ నేతలు, ప్రజలను నిర్బందిస్తూ, తెలంగాణ ఉద్యమం నాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వ అణిచివేతలను తలపిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాం మోహన్ రెడ్డి, కార్యకర్తల ముందస్తు అరెస్టును తీవ్రంగా ఖండించారు. తెలంగాణ గడ్డ పోరాటాల పురిటిగడ్డ.. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా తిరుగుబాటులను అణిచివేయాలనుకోవడం మూర్ఖత్వమన్నారు.
మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫుడ్ పాయిజనింగ్ జరిగిన విషయం తెలిసిందే. దీంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో మక్తల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు ఆందోళన నిర్వహించే అవకాశం ఉందనే అనుమానంతో బుధవారం తెల్లవారు నుంచే పోలీసులు అరెస్టులకు దిగారు. అరెస్టు చేసిన నాయకులను జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మాగనూరులో నిరసనలు, ఆందోళనలు జరుగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా డీఎస్పీ లింగయ్య నేతృత్వంలో భారీగా పోలీసులను మోహరించారు. చిట్టెం రామ్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టు నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు మక్తల్ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టగా.. వారిని పోలీసులు అరెస్టు చేశారు.