KTR | హైదరాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): అన్న అంటే అమ్మ+నాన్న అని కేటీఆర్ రుజువు చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు రంగం సిద్ధమైన క్షణం నుంచి జైలు నుంచి ఆమె బెయిల్‌పై విడుదలయ్యే వరకు అనుక్షణం కేటీఆర్ తోడుగా నిలిచారు.
ఒక అన్నగా తన బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తించారు. కవితకు సంబంధించిన లీగల్ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకోవడమే కాకుండా మధ్యమధ్యలో తీహార్ జైలుకు వెళ్లి తన చెల్లికి భరోసానిచ్చారు. కోర్టులో బెయిల్ కోసం కృషి చేయడం నుంచి కుటుంబాన్ని ధైర్యంగా ఉంచడం వరకు.. కవిత ఎపిసోడ్లో కేటీఆర్ పోషించిన పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ‘సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. మీరు ఇల్లు చేరిన సందర్భంలో సంతోషంతో మది ఉప్పొంగుతున్నది’ అని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత బుధవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే ఆయన తన కుటుంబ సభ్యులతో వెళ్లి స్వాగతం పలికారు. ఆమెను స్వాగతించే ఉద్విగ్న దృశ్యాలను తన ఎక్స్‌వేదికగా షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘మీరు ఇంటికి చేరడం సంతోషంగా ఉన్నది. క్లిష్ట సమయాల్లో ధైర్యం, పట్టుసడలని నిబ్బరం మీ వెంటే ఆశాదీపంగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): బీజేపీతో బీఆర్ఎస్ రాజీపడలేదని మాజీ మంత్రి, బీజేపీ నేత టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు. బుధవారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేది హాస్యాస్పదమని అన్నారు. విలీనమే అంటే ఇంత తతంగం ఉండేది కాదని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజీలేదని, రాజీ ఉంటే బెయిల్‌పై విడుదలైన తరువాత కవిత భాష అలా ఉండేది కాదని చెప్పారు.