హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలన్నీ అమలు చేసేంతవరకు వెంటపడుతూనే ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. ప్రభుత్వంలో జరిగే తప్పులను తెలంగాణ జాగృతి ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంటుందని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో జరిగిన జాగృతి ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా ఇవ్వడం లేదు. రూ.2 వేలు పింఛన్ పెంచామని చెప్పారు, కానీ పెంచలేదు. ఆ బాకీని మనం వసూలు చేయాలా? వద్దా? అని అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసినప్పడే తెలంగాణ తల్లికి నిజమైన నివాళి అర్పించినవాళ్లవుతారని స్పష్టం చేశారు. తెలంగాణతల్లి రూపురేఖల మార్పు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిమళ్లింపు రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు.
పేగులు మెడల వేసుకుంటా అంటూ వ్యాఖ్యలు చేసే సీఎం రేవంత్‌రెడ్డికి నిజంగా ధైర్యం ఉంటే నాగార్జునసాగర్ వద్ద మోహరించిన కేంద్ర బలగాలను వెనకి పంపించి, మన నీళ్లు మనకు తీసుకురావాలని కవిత సవాల్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో సాగర్ ప్రాజెక్టు తెలంగాణ చేతిలో ఉండేదని, ఇప్పుడు అకడ కేంద్ర బలగాలు మోహరించాయని చెప్పారు. కృష్ణ జలాలను ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతుంటే రేవంత్ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రాజకీయాల్లో ఉండటం, కేసీఆర్ కూతురు కావటం వల్లే కేంద్ర ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెట్టి ఐదున్నర నెలలు జైలుపాలు చేసిందని కవిత ఆవేదన వ్యక్తంచేశారు. ఏ తప్పూచేయని మనం ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. ఈ ఏడాది మొదట్లోనే తెలంగాణ జాగృతి మొదలుపెట్టిన బీసీ రిజర్వేషన్ల కార్యాచరణ కొనసాగిస్తూనే ఉన్నాం. మన కార్యక్రమం కొనసాగాల్సిందే. అని చెప్పారు.
తెలంగాణ జాగృతి ప్రజాచైతన్యాన్ని ఎప్పుడూ విస్మరించలేదని కవిత తెలిపారు. మహిళా రిజర్వేషన్ల సాధన కోసం అనేక సదస్సులు నిర్వహించి, కేంద్రం బిల్లు పెట్టడం, ఆమోదం తెలపడంలో జాగృతి చేసిన పోరాటం ఇమిడి ఉందని తెలిపారు. తెలంగాణ జాగృతి ఏర్పాటుకు స్ఫూర్తి కేసీఆర్ అయితే, మార్గదర్శనం జయశంకర్ సార్ అని కవిత వివరించారు. విజయాల స్ఫూర్తిని కొనసాగిస్తుందని స్పష్టంచేశారు. హాస్టల్ పిల్లలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.