జగిత్యాల, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా పుట్టినదే బీఆర్ఎస్ పార్టీ అని, తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్షగా ఉండటమే దాని ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ రజతోత్సవం అంటే కేవలం గులాబీ జెండా పార్టీది కాదని, బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం అంటే తెలంగాణ పండుగ అని చెప్పారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జగిత్యాల నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జగిత్యాల జిల్లా నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజల కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. సభలో కేసీఆర్ చెప్పే మాటలను గ్రా మాల్లో వివరించాలని కోరారు. ఎల్కతుర్తి సభ కోసం రూ. 5వేలు విరాళంగా ఇచ్చిన బీడీ కార్మికులకు కవిత ధన్యవాదాలు తెలిపారు.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమా ర్ ఏ పార్టీలో ఉన్నాడో అర్థం కావడం లేదని కవిత అన్నారు. పార్టీ మారినప్పటి నుంచి ఇక్కడి ఎమ్మెల్యే అసెంబ్లీలో కనిపించింది లేదని, మాట్లాడింది లేదని ఎద్దేవా చేశారు. జగిత్యాలకు నిధులు తీసుకురావడంలో విఫలమ య్యాడని అన్నారు. సమావేశంలో పార్టీ జి ల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ మంత్రి రాజేశంగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఓరుగంటి రమణారావు, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఒద్దినేని హరిచరణ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష. అబద్ధపు హామీలతో మోసపూరితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలను అరిగోస పెడుతున్నది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పదేండ్లు వెనక్కి పోయింది. బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా ప్రభుత్వంపై ఉద్యమించాలి. పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లిన వారిని తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదు.
– కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి
కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. రానున్న రోజులన్నీ బీఆర్ఎస్ పార్టీవే. తప్పుడు హామీలతో రాష్ట్ర ప్రజలు మోసపోయారు. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ గెలిచి తీరుతుంది. జగిత్యాల నియోజకవర్గంలో ప్రజల్లో దృఢవిశ్వాసం కల్పించేందుకు ఎమ్మెల్సీ కవిత పాదయాత్ర చేయాలి.
– ఎల్ రమణ, ఎమ్మెల్సీ