నిజామాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/బోధన్: దేశవ్యాప్తంగా బీసీ కుల గణనను ఎందుకు చేపట్టడం లేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అసలు చేస్తారా.. చేయరా? అని మోదీని నిలదీశారు. కుల వృత్తులకు చేయూతనివ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీల జీవితాలతో ఆడుకుంటున్నదని ధ్వజమెత్తారు. బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదని, ఓబీసీ రిజర్వేషన్లు ఎందుకు సక్రమంగా అమలు చేయడం లేదని కేంద్రాన్ని నిలదీశారు. దేశంలో బీసీలకు ఇంత అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించకుండా కాంగ్రెస్ పనికిరాని ప్రతిపక్ష పార్టీగా మారిందని విమర్శించారు. ఎన్నికలు ఉన్నా యి కాబట్టే బీసీలపై మొసలి కన్నీరు కారుస్తున్నాయని ఫైరయ్యారు.
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కుల సంఘాల గర్జన’ సభలో, నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మంగళవా రం తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ బీసీలకు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తామని, బీసీల కులగణనపై సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్‌చేశారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి ఉత్తిమాటలు చెప్పవద్దని హితవు పలికారు. మోదీ వెళ్లిన తర్వాత రాహుల్‌గాంధీ వచ్చి మళ్లీ బీసీలపై మొసలి కన్నీరు కార్చుతారని విమర్శించారు.
బీసీ సీఎం శుష్క నినాదం
పార్టీ రాష్ట్ర బీసీ అధ్యక్షుడిని తొలగించి కొ త్తగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని కవిత ఎద్దేవా చేశారు. బీసీ సీఎం నినాదం బీజేపీకి రాజకీయ నినాదమ ని, అదో శుష్క, శూన్య నినాదంగా అభివర్ణించారు. అధికారంలోకి రాకుండా బీసీ ముఖ్యమంత్రిని ఎక్కడి నుంచి చేస్తారని ప్రశ్నించా రు. నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ పోటీ చేయడంపై కవిత స్పందించారు. కామారెడ్డిలో చెల్లని రూపాయి నిజామాబాద్‌లో ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రెండుచోట్ల పోటీచేస్తున్నారు కాబట్టి తామూ రెండు చోట్ల పోటీచేస్తామని రేవంత్‌రెడ్డి, ఈటల సిద్ధమయ్యారని, ఇది పు లిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టేనని ఎద్దేవా చేశారు. వాళ్లు మూడుచోట్ల పోటీ చేసినా అంతిమంగా గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టంచేశారు. నిజామాబాద్ అర్బన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పారు. బోధన్ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకొనే షకీల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
కాళేశ్వరంపై రాజకీయ ఆరోపణలు: పొన్నాల
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలన్నీ రాజకీయ కోణంలో చేస్తున్నవేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. దీనిపై తాను ఏ చర్చకైనా సిద్ధమేనంటూ సవాల్ విసిరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా మంచీ చెడును గ్రహించాలని బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేర్కొన్నారు.