ఆదిలాబాద్ : కేంద్రంపై విమర్శలు చేసిన ప్రతిపక్ష నాయకులపై నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రభుత్వం ఐటీ, ఈడీ(IT and ED)లతో దాడులు చేయిస్తున్నదని సీపీఎం పొలిట్‌బ్యూరో(CPI-M) సభ్యుడు బీవీ రాఘవులు(BV Raghavulu) ఆరోపించారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితను(Mlc Kavitha) కేంద్ర సంస్థ ఈడీ(ED) విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నదని దుయ్యబట్టారు.
గురువారం ఆదిలాబాద్‌లో సీపీఎం జన చైతన్య యాత్రను బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీరయ్యతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలన(BJP Government)లో ప్రతిపక్ష నాయకులకు స్వేచ్ఛలేకుండా పోయిందని అన్నారు. ఎనిమిదేండ్లుగా అవినీతి, అక్రమాలు, మతోన్మాదం పేరిట బీజేపీ సాగిస్తున్న ఆగడాలను ప్రజలకు వివరించడానికి యాత్ర చేపట్టినట్లు వివరించారు. కేంద్రంలోని దుష్ట బీజేపీ పాలనను ప్రజలు అంతమొందించాలని పిలుపునిచ్చారు.
బీజేపీ అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం రూ.15 లక్షల చొప్పున పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఏమైందని ప్రశించారు. కేంద్ర ప్రభుత్వం 240 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తున్నదని, రైల్వేలు, విమానాశ్రయాలు, బ్యాంకులకు బడా పారిశ్రామిక వేత్తలకు కట్ట బెడుతుందన్నారు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను అదానీ(Adani), అంబానీ(Ambani)లకు కట్టబెడుతున్నదని పేర్కొన్నారు.
విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు గిరిజన యూనివర్సీటీని ఎందుకు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. ప్రమాదకరంగా మారిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాలనను ప్రజలు 2024 ఎన్నికల్లో అంతమొందించాలని రాఘువులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, సీపీఎం నాయకులు జయలక్ష్మి, బండి దత్తాత్రి, మల్లేశ్, కాంగ్రెస్ నాయకులు సుజాత, సాజిద్ ఖాన్, సీపీఐ నాయకుడు ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.