ఖలీల్‌వాడి/రుద్రూర్/బాన్సువాడ, జనవరి 12 : సీఎం రేవంత్‌రెడ్డి తనలో ఉన్న ఆర్ఎస్ఎస్ మూలాలతో పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆదివారం ఆమె ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిజామాబాద్, బాన్సువాడలో మీడియాతో మాట్లాడారు. గాంధీల కుటుంబాన్ని చూసి మైనార్టీలు కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే ఆ పార్టీ వారిని నట్టేట ముంచిందని విమర్శించారు. గద్దెనెక్కేందుకే అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తరువాత వాటి అమలును మరిచిందని మండిపడ్డారు. వెంటనే మైనార్టీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో మతకల్లోలాల జాడ కనిపించలేదని తెలిపారు. మతకల్లోలాలు జరుగుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. మైనార్టీ యువతులకు స్కూటీలతోపాటు షాదీముబారక్ పథకం కింద తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ అమలుచేయడంలేదని మండిపడ్డారు. మైనార్టీలకు బడ్జెట్లో కనీసం 25 శాతం కూడా కేటాయించలేదని విమర్శించారు. బడ్జెట్లో రూ.3 వేల కోట్లు కేటాయించి, కేవలం రూ.700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ది కోతలే కానీ చేతల ప్రభుత్వం కాదని ఎద్దేవా చేశారు. రైతు భరోసా కింద రూ.15 వేలు ప్రకటించి రూ.12 వేలు ఇస్తామనడంపై మండిపడ్డారు.
రైతుభరోసా సాయం విషయంలో మాట మార్చిన కాంగ్రెస్ పార్టీలో పోచారం శ్రీనివాసరెడ్డి ఎందుకు కొనసాగుతున్నారని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైనా పోచారం ఆ పార్టీలో ఎందుకు చేరారో చెప్పాలని నిలదీశారు. పార్టీ ఫిరాయించిన పోచారం శ్రీనివాసరెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించరని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో బాన్సువాడ నియోజకవర్గానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున కేసీఆర్ రూ.పదివేల కోట్లు ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, జాజాల సురేందర్, బీఆర్ఎస్ నాయకురాలు ఆయేషా ఫాతిమా, నగర మేయర్ దండు నీతూకిరణ్, జడ్పీ మాజీ చైర్మన్లు విఠల్‌రావు, దఫేదార్ రాజు తదితరులు పాల్గొన్నారు.