MLC Kavitha | హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవమైన బతుకమ్మను అవమానిస్తూ, కించపరుస్తూ మాట్లాడిన మంత్రులు, కాంగ్రెస్ నాయకులకు ఏ శిక్ష వేస్తారో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సమైక్యాంధ్రను కోరుకున్న కాంగ్రెస్ నాయకుల వాదనలనే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారికి కాంగ్రెస్ ప్రయోజనాలే తప్ప తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాదని దుయ్యబట్టారు. శుక్రవారం ఆమె బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ..
ఇందిరాగాంధీ, సోనియాగాంధీ బతుకమ్మను ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారని, ఎన్నికల సమయంలో ప్రియాంకాగాంధీ, రాహుల్‌గాంధీ కూడా బతుకమ్మను ఎత్తుకొని శుభాకాంక్షలు చెప్పారని గుర్తుచేశారు. ఎన్నికలప్పుడే కాంగ్రెస్ నేతలకు బతుకమ్మ గుర్తుకొస్తుందని, ఓట్ల కోసం ఎన్ని ఆటలైనా ఆడుతారని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత బతుకమ్మ ఎవరిదని, తెలంగాణతల్లి చేతిలో బతుకమ్మ ఎందుకు ఉండాలని కాంగ్రెస్ నేతలు వెర్రిప్రశ్నలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించారని గుర్తుచేశారు. బతుకమ్మను తాము విశ్వవ్యాప్తం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని మరుగున పడేసే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు.
కేసీఆర్‌ది విశాలతత్వం. రేవంత్‌రెడ్డిది సంకుచితత్వం. చరిత్రలో కొన్ని నల్ల పేజీలు రేవంత్ పేరు మీద చిరస్థాయిగా నిలిచిపోతాయి.
– కల్వకుంట్ల కవిత
తెలంగాణతల్లి రూపాన్ని ఎలా మారుస్తారని సీఎం రేవంత్‌రెడ్డిని కవిత ప్రశ్నించారు. ‘దేశంలో అనేక విగ్రహాలున్నాయని, ఆయా నాయకుల మీద ఉన్న గౌరవభావంతోనే వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నామని, అదేవిధంగా ఉద్యమ సమయంలో కూడా తెలంగాణతల్లి విగ్రహాలను కూడా వేలాదిగా ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. దేశంలో భరతమాత విగ్రహాలకు కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందా? తెలంగాణలో మాత్రం కొత్త విగ్రహాన్ని పెట్టి ఈమే మీ తల్లి, ఎవరైనా ఇదే విగ్రహం పెట్టాలి. వేరే విగ్రహం పెడితే కేసులు పెడుతామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఎన్నడూ భరతమాతపై గెజిట్ ఇవ్వలేదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణతల్లిపై గెజిట్ ఇవ్వడం దారుణం… ఘోరతి ఘోరమైన చర్య’ అని కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణతల్లిపై గెజిట్ ఇవ్వడం దారుణం. ఘోరతి ఘోరమైన చర్య. ఎన్ని జీవోలు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా ఊరూరా ఊరేగించి మరీ మా ఉద్యమతల్లిని నిలుపుకుంటాం. తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో తెలంగాణతల్లి విగ్రహాలను ఆవిషరించుకుంటాం.
– కల్వకుంట్ల కవిత
తెలంగాణతల్లి రూపాన్ని మార్చడానికి ప్రజల ఆమోదమే ఉంటే జీవోతో పనేమున్నది? కేసులు పెడుతామని బెదిరించాల్సిన అవసరం ఏమున్నదని కవిత ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఎందుకింత పిరికితనమని నిలదీశారు. విగ్రహాన్ని కూడా రహస్యంగా తయారు చే యించారని విమర్శించారు. అంత రహస్యంగా విగ్రహాన్ని రూపొందించడానికి ఇదేమైనా ఫ్యూడల్ వ్యవస్థనా, నాజీ ప్రభుత్వమా? అని మండిపడ్డారు. ప్రభుత్వ వేడుకల్లో సైతం తెలంగాణకు సంబంధం లేని పాటలు పాడుతున్నారని, తెలంగాణలో ఎంతోమంది జానపద కళాకారులు ఉంటే.. ఒక కళాకారుడు కూడా పాట పాడటానికి దొరకలేదా? పాడటానికి ఒక తెలంగాణ పాట దొరకలేదా? అని నిలదీశారు.
నీళ్ల కోసం పోరాటం చేసిన తెలంగాణలో, ఏపీకి అక్రమంగా నీళ్లు మళ్లించడానికి జీవోలు జారీ చేసిన అధికారిని సలహాదారుగా నియమించుకోవడాన్ని కవిత తప్పుబట్టారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకో టీఎంసీ నీటిని కృష్ణానది నుంచి ఎత్తిపోయడానికి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కాలంలో ఆదిత్యానాథ్‌దాస్ జీవోలు జారీ చేశారని, అలాంటి వ్యక్తిని తెలంగాణ సాగునీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించడం ఎవరి ప్రయోజనాల కోసమని నిలదీశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సాంస్కృతిక విధ్వంసం, తెలంగాణతల్లి రూపం మార్చడంపై తెలంగాణ జాగృతి తరఫున పోరాటాలు సిద్ధమవుతున్నామని కవిత వెల్లడించారు. అధికారిక వేడుకల్లో విష సంస్కృతిని ప్రవేశపెట్టి తెలంగాణ పాటలు కాకుండా వేరే పాటలు పాడించడం వంటి అంశాలపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు, ప్రొఫెసర్లు, ఆయా రంగాల ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు.
‘రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పుడు తెలంగాణ ఆనవాళ్లను ధ్వంసం చేస్తున్నారని, తెలంగాణతల్లి విగ్రహం చేతిలో నుంచి బతుకమ్మను చెరిపివేశారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రేవంత్ మా వారసత్వాన్ని నాశనం చేస్తుంటే, రాహుల్జీ మీరెందుకు మౌనంగా ఉన్నారు?’ అంటూ శుక్రవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఫొటోల కోసం బతుకమ్మ ఆడే రాహుల్, సోనియా, ప్రియాంకాగాంధీ మౌనాన్ని వీడాలని డిమాండ్ చేశారు.