హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): కొందరికి ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యమంటూ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ట్వీట్‌కు ఆమె కౌంటర్ ఇచ్చారు. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి గౌరవం దక్కదని.. వేధింపులకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్లు ధర్నా చేస్తున్నా.. తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవని.. ఢిల్లీ నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లినా ఎందుకు పట్టించుకోరని నిలదీశారు.
భేటీ బచావో-భేటీ పడావో కేవలం నినాదాలకే పరిమితమైందంటూ విమర్శించారు. సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు వంటగదిలో కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి దేశంలో నెలకొన్నదని అన్నారు. మహిళలకు విద్య, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ‘ఆడబిడ్డ తలుచుకున్నది.. ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది’ అని కవిత హెచ్చరించారు.