ఆర్మూర్, జూన్ 8: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూర్‌లో రాజ్యలక్ష్మీ సమేత నృసింహ స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు ఐదో రోజైన బుధవారం వైభవంగా జరిగాయి. ప్రతిష్ఠించనున్న మూర్తులకు జల, క్షీర, పుష్ప, ఫల, ధన, ధాన్య, శయ్యాధివాసాల క్రతువులు శాస్త్రోక్తంగా సాగాయి. ప్రాతః ఆరాధనతో మొదలైన కార్యక్రమాలు మూలమంత్ర మూర్తి హవనం, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హవనం, చతుఃస్థానార్చన, శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
నవ నారసింహ పూజలో భాగంగా ఉగ్ర, కృద్ధ, వీర, విలంబ, కోప, యోగ, అఘోర, సుదర్శన, శ్రీలక్ష్మీ నృసింహ ఆరాధన చూడముచ్చటగా సాగింది. నృసింహ కరావలంబం, నృసింహ స్తోత్రాలు అనంత భక్తిశ్రద్ధలతో పఠించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత-డీఆర్ అనిల్‌కుమార్ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ సతీమణి, కవిత తల్లి కల్వకుంట్ల శోభ, అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు రాంకిషన్‌రావు – నవలత, అరుణ్‌కుమార్-ననిత తదితరులు పాల్గొన్నారు. కాగా జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, జీవన్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, జాజాల సురేందర్, హన్మంత్‌షిండే, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు కూడా వేడుకలకు హాజరయ్యారు.