జనగామ, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ)/జనగామ రూరల్/భువనగిరి కలెక్టరేట్: బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకొంటే కుదరదని, ఒకటి కాదు మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం ఆమె బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా కార్యాలయంలో, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోనూ మీడియా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీసీ జనాభా 46% ఉంటే 42% రిజర్వేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
విద్యలో 46% రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు, ఉద్యోగాల్లో 46% రిజర్వేషన్లు కల్పిస్తూ మరొక బిల్లు, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మరొక బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు. బిల్లు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తేనే ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. జాప్యం చేసి ఇతరులు కోర్టుకు వెళ్లేలా అవకాశం ఇచ్చి చేతులు దులుపుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నట్టు నిర్దిష్టమైన సమాచారం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ధోకేబాజ్ పార్టీ అని, మాటలు చెప్పి మోసం చేయడం ఆ పార్టీకి అలవాటని మండిపడ్డారు. మళ్లీ కులగణన సర్వేకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, అయితే 15 రోజులు కాకుండా నెల రోజులపాటు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొంతమంది తమ ఉప కులం చెప్పలేదని అంటున్నారని, దానికి సంబంధించి ఏవిధంగా ఆలోచన చేస్తారో చెప్పాలని, హైదరాబాద్‌లో 60% మంది తమ ఇండ్లకు సర్వే చేసే వారు రాలేదని అంటున్నారని దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. రీ సర్వేపై ప్రభుత్వం విసృ్తతంగా ప్రచారం చేసి, టోల్‌ఫ్రీ నంబరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అసెంబ్లీ వద్ద అంబేదర్ విగ్రహాన్ని పెట్టాలని జాగృతి పదేండ్ల ముందే డిమాండ్ చేసిందని గుర్తుచేశారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. పింక్‌బుక్‌లో అన్నీ రాసుకుంటున్నాం. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి చెల్లిస్తాం. లెకలు ఎలా రాయాలో మాకూ తెలుసు. మీ లెకలు తీస్తాం’ అని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.
సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్‌రెడ్డి భయపడుతున్నారని, పోస్టు చేసిన మరుసటిరోజే ఇంటికి పోలీసులు వచ్చి వేధిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. రైతు డిక్లరేషన్‌పై నిలదీస్తారనే రాహుల్‌గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అబద్ధాలను ప్రజల్లో ఎండగడుతామని స్పష్టంచేసిన కవిత.. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
కేసీఆర్ ప్రారంభించిన తెలంగాణ ఉద్యమానికి భయపడి 2001లో ఆగమేఘాలపై దేవాదుల ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాన చేసినా, ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదని, కేసీఆర్ హయాంలో పనులు పూర్తిచేసి గ్రామాలకు నీళ్లు పారించారని కవిత వివరించారు.
బీఆర్ఎస్ హయాంలో 95% పూర్తయిన సమ్మక-సారక బరాజ్ పనుల్లో మిగిలిపోయిన 5% పనులను పూర్తి చేయలేని అసమర్థ, చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి ఇదే అంశంపై ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఆయా సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు క్యామ మల్లేశం, కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు.
జాతి సిగలో మెరువులు సంచార బిడ్డలు.. జీవన మాధుర్యపు బంధువులు అని ఎమ్మెల్సీ కవిత అభివర్ణించారు. జనగామ జిల్లా పర్యటనకు గురువారం వెళ్లిన ఆమె గాజులగంప నెత్తికి ఎత్తుకొని పూసలక్క వేషధారణలో స్థానికులను అలరించారు. ‘ప్రేమైక జీవన సారథులు.. సంప్రదాయ సౌందర్యపు ప్రతీకలు.. పూసలగంప పూల పుప్పొడి స్వచ్ఛతకు లోగిలి.. తెలంగాణ చేతివృత్తుల చేతనం.. ముత్తయిదు గాజుల మురిపెం..’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. జనగామ జిల్లా పెంబర్తిలో పూసలోళ్ల అకాచెల్లెండ్లు తనకు అపురూపంగా గాజులు తొడిగారని తెలిపారు. జయహో పూసలక.. జయహో బీసీ అని నినదించారు.
అవకాశవాదం కోసం పార్టీ మారిన కడియం శ్రీహరిని ప్రజలు క్షమించే ప్రసక్తే లేదు. ఉప ఎన్నిక వస్తే అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుంది. న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉన్నది. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్కు అనుకూలమైన తీర్పు వస్తుందన్న నమ్మకం ఉన్నది.
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
‘గతంలో పాలన ఎట్లుండె.. ఇప్పుడెలా ఉన్నది. కేసీఆర్ హయాంలో పంటలు దండిగా పండాయి. చెరువులు, కుంటలు పొంగిపొర్లేది. కానీ, ఇప్పుడు నీళ్లు లేవు. కాలువలు పారిందిలేదు. కాలంలేదు.. పంటలు ఎండిపోతున్నాయి. దసరాకు రెండు చీరలు ఇస్తా అన్నరు. ఒక్క జాకిట్ కూడా ఇయ్యలె.. లగ్గం అయిన వాళ్లకు తులం బంగారు పెడతా అన్నడు.
ఏదీ.. మొన్న మా మనువరాలికి లగ్గం అయ్యింది. తులం బంగారం రాలె. దొంగబస్సులు పెట్టిండు. మా పెంబర్తిలో ఒక్క బస్సు ఆగదు. ఆటోలే దిక్కు’ అని జనగామ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్సీ కవితతో పెంబర్తి గ్రామానికి చెందిన ఇట్టబోయిన నర్సమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నదో నర్సమ్మ మాటల్లోనే తెలుస్తున్నది.